Leading News Portal in Telugu

మధ్య ప్రదేశ్ లో అరాచకపర్వం.. పట్టపగలే ఆర్మీ ఆఫీసర్లపై దాడి! | two trainee army officers robbed| women friend gang raped| gunpoint| madhyapradesh| anarchy| law| and


posted on Sep 12, 2024 11:40AM

మధ్యప్రదేశ్ లో అరాచకం రాజ్యమేలుతోందా? చట్టం, శాంతి భద్రతల ఆనవాలే కనిపించడం లేదా? అంటే ఆ రాష్ట్రంలో  పెరుగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులు, దౌర్జన్యాలు అరాచకాలు, అత్యాచార ఘటనలను చూస్తే ఔనని అనక తప్పదు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనిపించేలా, అడుగు తీసి బయటకు వెడితే క్షేమంగా తిరిగి ఇంటికి చేరుతామా అని జనం భయపడే పరిస్థితులు ఉన్నాయనడానికి తాజాగా ఇండోర్ లో  జరిగిన దారుణ ఘటనే నిదర్శనం.

సరదాగా తమ స్నేహితురాళ్లతో విహార యాత్రకు వెళ్లిన ఇద్దరు శిక్షణలో ఉన్న ఆర్మీ అధికారులపై కొందరు దుండగులు దాడి చేశారు. సాయుధులైన ఎనిమిది మంది ముఠా తుపాకులతో బెదరించి వారి వద్ద ఉన్న సొత్తు దోచుకున్నారు.  ఆర్మీ ట్రైనీ ఆఫీసర్ల స్నేహితురాళ్లలో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఒక ఆర్మీ ట్రైనీ ఆఫీసర్ ను, ఒక మహిళను బందీగా పట్టుకుని మిగిలిన ఇద్దర్నీ పది లక్షల రూపాయలు ఇచ్చి విడిపించుకు వెళ్లాలంటూ పంపించారు. ఈ సంఘటన జరిగింది ఎక్కడో మారుమూల ప్రదేశంలో కాదు. ఇండోర్ లో ని  మావు ఆర్మీ కాలేజీకి కూతవేటు దూరంలో జరిగింది.

తమ స్నేహితురాళ్లతో సరదాగా కాలేజీకి సమీపంలోని  ఫైరింగ్ రేంజ్ వద్దకు వెళ్లిన ట్రైనీ ఆర్మీ ఆఫీసర్లను సాయుధులైన ఎనిమిది మంది దుండగులు  చుట్టుముట్టి తుపాకులతో బెదరించారు. దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఇద్దరిని బందీలుగా పట్టుకుని వారిని విడిచిపెట్టడానికి సొమ్ములు డిమాండ్ చేశారు. ఇదంతా ఆర్మీ ట్రైనింగ్ కాలేజీకి కేత వేటు దూరంలో జరిగిందంటే దుండగులు ఎంతగా బరితెగించారో అర్ధమౌతుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకునేలోగానే దుండగులు తప్పించుకున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. అరెస్టైన వారికి నేర చరిత్ర ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ సంఘటన మంగళవారం (సెప్టెంబర్ 10) సాయంత్రం జరిగింది. సాయుధులు యథేచ్ఛగా తుపాకులు, మారణాయుధాలతో అదీ ఆర్మీ కాలేజీకి సమీపంలోనే సంచరిస్తోందంటే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎంత సుందరముదనష్టంగా ఉందో అవగతమౌతోంది.