posted on Sep 18, 2024 11:53AM
మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు, విచారణ ఇక జెట్ వేగంతో సాగనున్నాయా? అంటే మంగళవారం ( సెప్టెంబర్ 17) అనూహ్యంగా జరిగిన పరిణామాలను గమనిస్తే ఔనని అనక తప్పదు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు విషయంపై చర్చించారు. సొంత బాబాయ్ హత్య కేసు విషయంలో జగన్ తాను అధికారంలో ఉన్న ఐదేళ్లూ పట్టింపు లేకుండా వ్యవహరించారు. పైపెచ్చు.. ఈ కేసులో నిందితులను వెనకేసుకు వచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేసిన జగన్ తీరా అధికారంలోకి వచ్చాకా? సీబీఐ దర్యాప్తు ఎందుకు మా రాష్ట్ర పోలీసులు ఉన్నారుగా అన్నారు.
అయితే వివేకా కుమార్తె డాక్టర్ సునీత మాత్రం ఊరుకోలేదు. సీబీఐ దర్యాప్తు కోసం పట్టుబట్టి సాధించారు. అయితే జగన్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు అడుగడుగునా అడ్డంకులు కల్పించింది. ఏకంగా సీబీఐ అధికారులపైనే కేసులు నమోదయ్యాయి. వారిపైనే దాడులు జరిగాయి. దీంతో సునీత మళ్లీ సుప్రీంను ఆశ్రయించారు. స్థానిక ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసు దర్యాప్తులో జోక్యం చేసుకుంటున్నారని, ఏపీలో నిష్పక్షపాత విచారణ జరుగుతున్న నమ్మకం లేదని, కేసు విచారణ బయట రాష్ట్రాలకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టును సునీతా రెడ్డి కోరారు. సీబీఐ కూడా సునీత చెప్పిన ప్రతి విషయం అక్షర సత్యమని సుప్రీం కోర్టుకు తెలియజేయడంతో సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు విచారణను తెలంగాణలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు బదలీ చేసింది. దాంతో అప్పట్లో వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఒక దశలో ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టుకు కూడా సీబీఐ సిద్ధమైంది. అయినా అరెస్టు చేయలేదు. అది వేరే సంగతి.
అధికారం అండతో వివేకా హత్య కేసు దర్యాప్తు, విచారణకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించిన జగన్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. కూటమి సర్కార్ కొలువు దీరింది. ఈ నేపథ్యంలో వివేకా హత్య కేసు విచారణ స్పీడ్ ట్రాక్ లోకి వస్తుందని అంతా భావించారు. అందుకు తగ్గట్టుగానే వివేకా కుమార్తె సునీత ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంగళవారం (సెప్టెంబర్ 17) భేటీ అయ్యారు. వివేకా హత్య కేసులో న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. దీంతో ఇక ఈ కేసు విషయంలో సీబీఐ దూకుడుగా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.