Leading News Portal in Telugu

ఆంధ్రాతో పోలిక ఎందుకు హరీషూ! | harish rao comments on andhra| harish rao andhra| harish rao| andhra pradesh| telangana| revanth reddy


posted on Sep 23, 2024 6:57PM

బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు ఇంకా రాజకీయాల్లోనే వున్నారు. ఆ విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికే అన్నట్టుగా ఆయన చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. తన ఉనికిని నిరూపించుకోవడానికే తప్ప విషయం ఏమీ లేదన్నట్టుగా ఏవో నాలుగు కామెంట్లు చేసి మీడియా సమావేశాన్ని ముగించారు. ఈ సందర్భంగా ఆయన ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం శాశ్వతం కాదు. అధికారులు రెచ్చిపోవద్దు’’ అని  ఆయన అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. ఆయన తన స్టేట్‌మెంట్‌ని అక్కడతో ఆపితే బాగుండేది. దాన్ని ఇంకొంచెం సాగదీస్తూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌లో గత ప్రభుత్వంలో అధికారులు రెచ్చిపోయారు. ప్రస్తుతం సస్పెండ్ అవుతున్నారు. అధికారంలో వున్నామని రెచ్చిపోతే అక్కడి అధికారులకు పట్టిన గతే మీకూ పడుతుంది’’ అన్నారు. 

అయినా, తెలంగాణ సాధించుకున్న తర్వాత పక్క రాష్ట్రంతో పోలికలు పెట్టాల్సిన అవసరం హరీష్ రావుకు ఎందుకో అర్థం కావడం లేదు. అలా పోల్చదల్చుకుంటే పక్క రాష్ట్రంతో ఎందుకు… తమ పార్టీ పదేళ్ళ పాలనతో పోల్చి చెప్పొచ్చు కదా. టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో నాయకులు, వాళ్ళకి అనుకూలంగా అధికారులు ఈ ప్రభుత్వం శాశ్వతంగా వుంటుందనుకుని రెచ్చిపోయారు. చివరికి ఏమైంది? ప్రజలు బాగా బుద్ధిచెప్పారు. తమను తామే ఉదాహరణగా చెప్పుకుంటే సరిపోయేదానికి హరీష్ రావు పక్క రాష్ట్రంలో  విషయాలను ప్రస్తావించడం ఎందుకో! అయినా ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు జగన్ పాలన అదిరిపోయేలా సాగిందని, మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని తన దగ్గర సమాచారం వుందని కేసీఆర్ ఆమధ్య కనపడినవాళ్ళందరికీ చెప్పారు. మరి ఇప్పుడు హరీష్ రావేమో వైసీపీ పాలనలో అధికారం శాశ్వతంగా వుంటుందనుకుని అధికారులు రెచ్చిపోయారు అంటున్నారు. హరీష్ రావు ఇలా జగన్ ప్రభుత్వాన్ని తెగిడితే మామయ్య కేసీఆర్ హర్టవుతారు కదా! ఈ చిన్న లాజిక్‌ని హరీష్ రావు ఎలా మిస్సయ్యారో!