posted on Sep 25, 2024 9:16AM
తెలంగాణను భారీ వర్షాలు వీడటం లేదు. గత మూడు నాలుగు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇక బుధవారం (సెప్టెంబర్ 25) రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనమే ఇందుకు కారణమని పేర్కొంది. ఈ ప్రభావంతో నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవి కాకుండా మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక మంగళవారం జనగామ జిల్లా దేవరుప్పలలో అత్యధికంగా 11.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.