ఆర్. కృష్ణయ్యకు బీజేపీ తీర్ధం.. వ్యూహమిదేనా? | rkrishnayya join bjp| kamalam| party| strategy| telangana| strengthen| party| ycp| empty
posted on Sep 25, 2024 10:06AM
ఐదేళ్ల పాటు అధికార మదంతో విర్రవీగిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ప్రస్తుతం షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి ప్రతిపక్ష పార్టీల్లోని ముఖ్యనేతల వరకు జగన్ హయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీసం పనులు చేసుకోవడానికి ఉపాధి అవకాశాలు లేక, వైసీపీ నేతల దౌర్జన్యాలను భరించలేక అనేక కుటుంబాలు రాష్ట్రం వదిలి బతుకుతెరువు కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిన ఘటనలు కోకొల్లలు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. జగన్ ఐదేళ్ల పాలనలో ఏపీ ప్రజలు రాక్షస పాలనను ప్రత్యక్షంగా చూశారు. అనుభవించారు. దీంతో జగన్ రాక్షస పాలనకు చరమగీతం పాడాలన్న కృత నిశ్చయంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓటు వేశారు. జగన్ మోహన్ రెడ్డికి దిమ్మతిరిగే షాకిచ్చారు. కనీసం విపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్ ను కేవలం పులివెందుల ఎమ్మెల్యేకే పరిమితం చేశారు. అధికారం కోల్పోయినప్పటికీ జగన్ ప్రవర్తనలో మార్పు రాలేదు. రావడం లేదు. దీంతో జగన్ తీరు నచ్చని వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్యనేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. మరోవైపు రాజ్యసభలోనూ వైసీపీని వీడుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వైసీపీలో ఉంటే ప్రజలు క్షమించరని వైసీపీ రాజ్యసభ సభ్యులు ఆ పార్టీకి బైబై చెప్పేస్తున్నారు.
వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావులు ఇటీవల వైసీపీకి, రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆర్ కృష్ణయ్య సైతం రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. 2022 జూన్‍లో ఆర్.కృష్ణయ్యను వైసీపీ రాజ్యసభకు పంపించింది. తెలంగాణకు చెందిన బీసీ నేతను రాజ్యసభకు పంపించడంపై అప్పట్లో వైసీపీలోనే అసంతృప్తి భగ్గుమంది. అయితే జగన్ ను ఎదిరించే ధైర్యం లేక పార్టీ శ్రేణులు, నేతలు మిన్నకున్నారు. ఇప్పుడు ఆయన అనూహ్యంగా రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభలో వైసీపీ బలం 11 నుంచి ఎనిమిదికి పడిపోయింది. ప్రస్తుతం పెద్దల సభలో వైసీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, వి. విజయసాయిరెడ్డి, నిరంజన్ రెడ్డి, మేడా రఘునాథరెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, సుభాష్ చంద్రబోస్ పిల్లి, నత్వాని పరిమళ్ ఉన్నారు. రాబోయే రోజుల్లో మరో ఐదారుగురు వైసీపీ రాజ్యసభ సభ్యులు సైతం రాజీనామా చేస్తారన్న ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
ఆర్. కృష్ణయ్య బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కృష్ణయ్య గతంలో అరెస్సెస్ లో క్రియాశీలకంగా పని చేశారు. ఏబీవీపీలో ఉన్నప్పటి నుంచే బీజేపీ నేతలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తెలంగాణలో బీసీ ఓటింగ్ పైన బీజేపీ ఫోకస్ చేసింది. బీసీ సీఎం నినాదం గత ఎన్నికల్లో బీజేపీకి లాభించింది. అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ ఎనిమిది లోక్ సభ సీట్లను గెలుచుకుంది. ఫలితంగా పార్టీలో బీసీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో బలమైన బీసీ నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్యను బీజేపీలోకి తీసుకోవటం ద్వారా మేలు జరుగుతుందని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నది. దీనికితోడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం.. అసెంబ్లీలో కూటమికి పూర్తి మెజార్టీ ఉండటంతో తిరిగి బీజేపీ నుంచి ఎంపీగా కృష్ణయ్యకు అవకాశం ఇస్తామని ఆ పార్టీ నేతలు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికే తాను రాజీనామా చేసినట్లు ఆర్ కృష్ణయ్య చెబుతున్నారు.
ఇక బీజేపీ కూడా ఒకే దెబ్వబకు రెండు పిట్టలు అన్నట్లుగా తెలంగాణలో బలోపేతం కావడంతో పాటు, ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీని కోలుకోలేని దెబ్బ కొట్టడం కోసం ఆర్ కృష్ణయ్యకు పార్టీ తీర్థం ఇవ్వడానికి సిద్ధమైపోయింది. 2028లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికార పీఠాన్ని దక్కించు కోవాలని బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నది. తెలంగాణలో ఇప్పటికే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణ మాదిగను బీజేపీ తమవైపు తిప్పుకుంది. ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా తీర్పు వచ్చింది. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంటూ మాదిగల పోరాటానికి అండగా నిలిచింది.
దీంతో మందక్రిష్ణ, ఆయన మాదిగ సామాజిక వర్గంలో మెజార్టీ భాగం బీజేపీకి అండగా నిలుస్తున్నది. తెలంగాణలో యాభైకి పైగా నియోజకవర్గాలలో మాదిగల ప్రభావం ఉంది. అదేవిధంగా తెలంగాణలో బీసీ ఓటు బ్యాంకు ఎక్కువే. దీంతో బీసీ పోరాటాన్ని దశాబ్దాలుగా అలుపెరగకుండా చేస్తూ వస్తున్న ఆర్. క్రిష్ణయ్యను తమవెంట ఉంచుకుంటే రాబోయే కాలంలో పార్టీకి మరింతగా మేలు జరుగుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మరోవైపు ఆర్. క్రిష్ణయ్య బీజేపీలో చేరితే మళ్లీ రాజ్యసభ సీటు దక్కడంతోపాటు.. రాబోయే కాలంలో కలిసొస్తే కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవుల్లోనూ కనిపించే అవకాశాలు లేకపోలేదు. అన్ని అంశాలను బేరీజు వేసుకొని క్రిష్ణయ్యసైతం బీజేపీలో చేరబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.