posted on Sep 25, 2024 2:53PM
అడ్డెడ్డే.. రోజా మేడమ్‌కి ఎంత కష్టం వచ్చి పడింది. ఎంతో ముచ్చటపడి ఏర్పాటు చేసుకున్న యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆర్కే రోజా సెల్వమణి తన పేరుతో రెండేళ్ళ క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నారు. అందులో రెండు వేలకు పైగా వీడియోలు పోస్టు చేశారు. తాను, తన పార్టీ అధికారంలో వుండగా నిర్వహించిన అన్ని కార్యక్రమాల వీడియోలు ఆ యూట్యూబ్ ఛానల్లో పోస్టు చేస్తూ వచ్చారు. రోజాగారి ఛానల్‌కి దాదాపుగా రెండున్నర లక్షల మంది సబ్‌స్క్రైబర్లు కూడా వున్నారు. అప్పటి ఎమ్మెల్యేగా తన అధికార కార్యక్రమాలతోపాటు తనకు కుటుంబానికి సంబంధించిన వీడియోలు కూడా అందులో పోస్టు చేస్తూ వచ్చారు. రోజా మేడమ్ ఇంట్లో పిల్లికి పేరంటం జరిగినా ఆ ఛానల్లో వీడియో ప్రత్యక్షం అయ్యేది. నిన్నగాక మొన్న తిరుమల లడ్డూ విషయంలో రోజా అడ్డదిడ్డంగా మాట్లాడిన వీడియో కూడా ఆ ఛానల్లోనే పోస్టు అయింది. ఆ తర్వాతే రోజాకి కష్టం వచ్చి పడింది. రోజా తన ఛానల్లో ఒపీనియన్ పోల్ పోస్టులు పెట్టారు. వాటికి జనం నుంచి వచ్చిన స్పందన రోజా బుర్ర తిరిగిపోయేలా వుంది.
తిరుమలలో ఎవరి పాలన బాగుందని రోజా పోల్ పెడితే… 24 గంటలు ముగియకుండానే.. 19 వేల మంది ఓట్లు వేశారు. అందులో చంద్రబాబు పాలన బాగుందని 76 శాతం మంది ఓటు వేశారు.
అలాగే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో తప్పు ఎవరిది అనే ప్రశ్న వేసి, దాని కింద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం జగన్‌లపై పోల్ పెట్టారు. ఈ పోల్‌కు కూడా 23 గంటలకు 62 వేల మంది ఓటు వేశారు. ఇందులో 72 శాతం మంది జగన్ వల్లే తిరుమల లడ్డూ కల్తీ జరిగిందని ఓటు వేశారు. ఈ పోలింగ్ పోస్టుల కింద కామెంట్లు అయితే రోజాకి, జగన్‌కి వ్యతిరేకంగా హోరెత్తిపోయాయి. దీంతో షాకైపోయిన రోజా తిరుమల వ్యవహారంపై పెట్టిన రెండు పోల్స్.ని డిలీట్ చేయడమే కాకుండా.. ఇన్ని రోజులుగా ప్రేమగా నడుపుతున్న యూట్యూబ్ చానల్‌ను డిలీట్ చేశారు. అంతే కాకుండా తనకు యూట్యూబ్ ఛానలే లేదని, ఎవరో తన పేరు మీద ఛానెల్ ఓపెన్ చేశారని జగన్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.