posted on Oct 3, 2024 1:00PM
హైడ్రా కోసం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ వర్మ ఆమోద ముద్ర వేశారు. దీంతో ఇకపై హైడ్రా చేపట్టబోయే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధతతో పాటు రక్షణ కూడా ఉంటుంది. ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ ను 6 నెలలలోపు అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి చట్టం చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. అప్పటివరకు హైడ్రాకు గవర్నర్ ఆమోదించిన ఈ ప్రత్యేక ఆర్డినెన్స్ రక్షణగా ఉండబోతోంది.ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో హైడ్రా ఆర్డినెన్స్ కు ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఆ ఆర్డినెన్స్ కు ఇప్పుడు గవర్నర్ ఆమోదముద్ర పడింది. గ్రేటర్ హైదరాబాద్ లోని చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ప్లే గ్రౌండ్స్ సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం, ప్రకృతి వైపరిత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు సంభవించినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్దీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు సంబంధించి ఎన్ ఓసీల జారీ తదితర లక్ష్యాలతో జూలై 19న జీవో నెంబర్ 99 ద్వారా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది.