Leading News Portal in Telugu

మెరీనా బీచ్‌లో ఎయిర్‌ షో సందర్భంగా నలుగురి మృతి | Marina Beach IAF Mega Air Show| Mega Air Show| Marina Beach


posted on Oct 6, 2024 9:43PM

చెన్నై మెరీనా బీచ్‌లో భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన ‘మెగా ఎయిర్ షో’  సందర్భంగా విషాదం ఏర్పడింది. ఎయిర్ షోను వీక్షించేందుకు లక్షలాది సందర్శకులు వచ్చారు. ఎయిర్ షో ముగిశాక వారు తిరుగు ప్రయాణంలో ఎక్కడికక్కడ రద్దీ ఏర్పడింది. దాంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉక్కపోత, ఎండవేడిని తట్టుకోలేక ముగ్గురు ప్రాణాలు విడిచారు. మరొకరు హార్ట్ ఎటాక్‌తో మృతి చెందారు. అస్వస్థతకు గురైన దాదాపు 230 మందిని చెన్నైలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. మృతులు శ్రీనివాసన్, కార్తికేయన్, జాన్బాబు, దినేష్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఎయిర్ షోకు దాదాపు 13 లక్షలమందికి పైగా సందర్శకులు హాజరైనట్లు అంచనా. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకే ఎయిర్ షో ముగిసినప్పటికీ, సాయంత్రం వరకు ట్రాఫిక్ కొనసాగింది. గాయపడిన వారిని అంబులెన్సుల ద్వారా ఆస్పత్రులకు తరలించడానికీ ఇబ్బంది ఎదురైంది. చెన్నై నుంచే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావడంతో.. మెరీనా బీచ్ సమీపంలోని లైట్స్ మెట్రో స్టేషన్, వెళచ్చేరి వద్ద ఉన్న మెట్రో రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. షో ముగిసిన తర్వాత తిరుగుప్రయాణం కోసం వేలాది మంది ఒక్కసారిగా స్టేషన్లకు చేరుకోవడంతో.. ప్లాట్ ఫామ్‌ల మీద నిలబడటానికి కూడా వీల్లేని పరిస్థితి ఏర్పడింది.