Leading News Portal in Telugu

జీవన్ రెడ్డి  ఎఐసిసి చీఫ్ కు  ఘాటు లేఖ


posted on Oct 24, 2024 2:49PM

కాంగ్రెస్ ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి అధిష్టానంతో    తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తన ముఖ్య అనుచరుడు గంగారెడ్డిని ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడు హత్య చేయడం పట్ల తీవ్ర కలత చెందినట్లు కనిపిస్తుంది. గంగారెడ్డి ని హత్య చేసిన సంతోష్ గత ఎన్నికల్లో బిఆర్ ఎస్ తరపున పని చేసినట్లు జీవన్ రెడ్డి ఏఐసిసి చీఫ్ ఖర్గేకు రాసిన  లేఖలో పేర్కొన్నారు.అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారన్నారు . కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన చనువుతో తన అనుచరుడైన గంగారెడ్డి హత్యకు గురయ్యాడని జీవన్ రెడ్డి ఈ లేఖలో పేర్కొన్నారు.  బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గేట్లు తెరవడంతో అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు దూరమవుతున్నారని లేదా హత్యలకు గురవుతున్నారని ఆయన ఆవేదన చెందారు పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకించిన  రాజీవ్  గాంధీ ఆశయాలకు తిలోదకాలిచ్చే విధంగా రేవంత్ సర్కారు చర్యలుంటున్నాయని ఆయన ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ సీట్లు ఉన్నప్పటికీ పక్క పార్టీల ప్రజా ప్రతినిధులను చేర్చుకోవడం తప్పుడు సంకేతాలు తీసుకెళుతుందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు.పదేళ్లుగా బిఆర్ ఎస్  ఏఏ పనులు చేసిందో అవే పనులు రేవంత్ సర్కార్ చేస్తుందన్నారు .  అప్పట్లో కెసీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే రేవంత్ సర్కార్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటుందన్నారు.  కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తితో జీవన్ రెడ్డి మీకో దండం మీ పార్టీకో దండం అంటూ హాట్ టాపిక్ గా మారారు.