Leading News Portal in Telugu

ముందస్తు బెయిలు కోసం కోర్టును ఆశ్రయించిన ఎంవీవీ | vizag former mp mvv satyanarayana petition for anticipatory bail| ed| arrest


posted on Oct 26, 2024 11:43AM

ఎవరు చేసిన  కర్మ వారనుభవించకా తప్పదన్నా అన్నట్లుగా జగన్ హయాంలో ఇష్టారీతిగా, అడ్డగోలుగా అక్రమాలు, ఆక్రమణలు, కబ్జాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా కేసుల పాలౌతున్నారు. కటకటాల పాలౌతున్నారు. అలాగే జగన్ హయాంలో నిబంధనలను తుంగలో తొక్కి అధికార పార్టీతో అంటకాగిన ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా కూడా కేసుల భయంతో వణికిపోతున్నారు.

పలువురు అయితే ఎటువంటి పోస్టింగులకూ నోచుకోకుండా జీఏడీలో రిపోర్టు చేసి ఈగలు తోలుకుంటున్నారు. ఇప్పడు తాజాగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా వారి జాబితాలో చేరారు. వైసీపీ అధికారంలో ఉండగా ఎంవీవీ ఇష్టారీతిగా కబ్జాలు, ఆక్రమణలతో చెలరేగిపోయారు. ఎంతగా అంటే ఆయనతో వ్యాపారాలు చేసిన వారికీ వాటాలు ఇవ్వకపోవడంతో వారు ఆయన కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసి బెదరించే వరకూ  తెచ్చుకున్నారు. అప్పట్లో  వైసీపీ అధికారంలో ఉండటంతో కప్పం చెల్లించుకుని కుటుంబ సభ్యులను విడిపించుకోగలిగారు. ఇప్పుడు వైసీపీ అధికారంలో లేదు. దీంతో ఆయన పాత దందాలకు మూల్యం చెల్లించుకోకతప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 

దీంతో ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన దాదాపు అజ్ణాత వాసం చేస్తున్నారు. ఎవరికీ అందుబాటులో ఉండటం లేదు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ నేతలకు సైతం ఆయన చిక్కడం లేదు. వారి ఫోన్ కాల్స్ కు స్పందించడం లేదు. ఇటీవల ఎంవీవీ నివాసం, కార్యాలయాలపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆ సోదాలలో ఎంవీవీ పెద్ద ఎత్తున అక్రమాలు, అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది. ఆ మేరకు ఒక ప్రకటన కూడా ఈడీ నుంచి వెలువడింది. తన నివాసాలపై ఈడీ దాడులు జరిగిన సమయంలో కూడా ఆయన విశాఖలో లేరు.  ఈడీ సోదాల తరువాత ఎంవీవీ అరెస్టు భయంతో వణికిపోతున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా ఎంవీవీని ఈడీ  ఇహనో ఇప్పుడో ఎంవీవీ అరెస్టు ఖాయం అన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఎంవీవీ కూడా తన అరెస్టు అనివార్యం అన్న నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు. అందుకే ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు.  తనను తాను కేసుల నుంచి తప్పించుకోవడానికి తెలుగుదేశం కూటమి పార్టీల సహాయం కోరుతున్నారు. అవకాశం ఇస్తే వైసీపీకి గుడ్ బై చెప్పి వచ్చి చేరుతానంటూ రాయబారాలు పంపినట్ల ప్రచారం జరుగుతోంది. అయితే  ఎక్కడ నుంచీ ఏ పార్టీ నుంచీ ఆయనకు సానుకూల స్పందన దక్కలేదు. చేసిన కర్మ అనుభవించాల్సిందే అన్నట్లుగా ఎంవీవీని చేర్చుకోవడానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీలు నిరాకరించాయని అంటున్నారు. దీంతో అన్ని దారులూ మూసుకుపోయి ఎంవీవీ దిక్కుతోచని స్థితిలో ఉన్నారని అంటున్నారు.