జగన్ పాలన అంతానికి బీజం వేసిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కి ఏడాది! | one year to cbn gratitude concert| step|towards| jagan| anarchy| rule
posted on Oct 29, 2024 11:08AM
నారా చంద్రబాబునాయుడిని జగన్ సర్కార్ కుట్రతో స్కిల్ కేసు పేరిట అక్రమంగా అరెస్టు చేసింది. ఆ సందర్భంగా వెల్లువెత్తిన ప్రజాగ్రహం మహామహా తలపండిన నేతలనే ఆశ్చర్యానికి గురి చేసింది. రాజకీయాలతో సంబంధం లేకుండా జనం వెల్లువలా బయటకు వచ్చి ఆందోళనలకు దిగారు. కులం, మతం, రాజకీయం, రాష్ట్రం, దేశం ఇలా ఎలాంటి తేడాలూ లేకుండా ప్రపంచం నలుమూలల చంద్రబాబు అరెస్టునకు నిరసనగా ప్రదర్శనలు జరిగాయి. ఆందోళనలకు, నిరసనలకూ ఎవరూ పిలుపు ఇవ్వలేదు. ఎవరికి వారుగా స్వచ్ఛందంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి రోడ్లపైకి వచ్చారు. నిర్బంధాలను లెక్క చేయలేదు. ఎవరాపగలరు మా ఆగ్రహాన్ని. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. అరెస్టులతో చంద్రుడి వెలుగులను దాచలేరు అంటూ జనం నినదించారు. ఒక నేతను అరెస్టు చేస్తే ఇంత జనాగ్రహమా? ఏమిటి ఆయన గొప్పతనం? ఎందుకింత ప్రజాభిమానం. , ఆయనేమీ దేవుడు కాదే. ఇంద్రుడూ కాదు , చంద్రుడూ కాదు. ఎందరో నాయకుల్లో ఆయనొకరు, కానీ, ఆయన కోసం ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతి దేశంలో ఆందోళనలు జరిగాయి. ఆయనను విడుదల చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.
అవన్నీ ఒకెత్తైతే గచ్చిబౌలిలో నిర్వహించిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ మరో ఎత్తు. ఆ సభ ఒక అద్భుతం. ఎవరెవరో, ఎక్కడెక్కడ నుంచో వచ్చి చంద్రబాబు కోసం గళం విప్పారు. దేశ విదేశాల నుంచి విభిన్న వర్గాల ప్రముఖులు, సామాన్యులు ఒక్కటిగా మారి చంద్రబాబు గోప్పతనాన్ని వివరించారు. ఆయన అరెస్టు అక్రమమని నినదించారు. చరిత్రలో న భూతో న భవిష్యతి అన్నట్లుగా జరిగిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ కు నేటికి ( 29 అక్టోబర్ 2025) సరిగ్గా ఏడాది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో అధికార పగ్గాలు చేపట్టిన జగన్ ఐదేళ్లు అరాచక పాలన సాగించారు. మంచి, చెడ్డా, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా ప్రత్యర్థులను వేధించడమే పాలన అన్నట్లుగా ఆయన హయాంలో అరాచకం తాండవమాడింది. అందులో భాగంగానే రాజకీయ కక్షతో జగన్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో నిర్బంధించారు. చంద్రబాబును అరెస్టు చేయడానికి ముందు వరకూ జగన్ సర్కార్ పై ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత ఆగ్రహం ఉన్నా.. నిర్బంధం, పాశవిక దాడులకు భయపడి జనం ఆగ్రహాన్ని అణిచిపెట్టుకుని ఉన్నారు. ఎన్నికల కోసం ఎదురు చూస్తూ గడిపారు. కానీ ఎప్పుడైతే జగన్ అక్రమంగా చంద్రబాబును జైలుకు పంపారో అప్పుడిక జనం భయాన్ని వదిలేశారు. జగన్ దుర్మార్గంపై తిరగబడ్డారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఆందోళనలను చేశారు. ఆసమయంలోనే చంద్రబాబుకు సంఘీభావంగా దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో తరలి వచ్చి గచ్చిబౌలిలో చంద్రబాబు గ్రాటిట్యూడ్ కన్సర్ట్ నిర్వహించారు.
సాధారణంగా ఎవరైనా అరెస్టైతే ఆయన చేసిన అక్రమాల గురించి ప్రజలు చర్చించుకుంటారు. ఆయన అన్యాయాలపై మాట్లాడుకుంటారు. కానీ చంద్రబాబు అరెస్టైన తరువాత ప్రజలలో ఆయన గొప్పతనం గురించి చర్చ జరిగింది. ఆయన సాధించిన ఘనతల గురించి జనం మాట్లాడుకున్నారు. ఇక సీబీఎన్ గ్రాటిట్యూడ్ కన్సర్ట్ అయితే చంద్రబాబు నాయుడు గొప్ప తనాన్ని మరో మారు ప్రపంచం కళ్లకు కట్టింది.
అవును హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో సరిగ్గా ఏడాది కిందట జరిగిన ఆ సభ చంద్రబాబు నాయుడు దార్శనికతకు దర్పణంగా నిలిచింది. ఎప్పుడో, పాతికేళ్ళ నాడు కొండలు గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు నాయుడు నాటిన ఐటీ విత్తనం, మహావృక్షమై నిలిచిన దృశ్యం ఆవిష్కృతమైంది. చంద్రన్నకు ఐటీ వందనం చేసింది. తెలుగు యువత హైటెక్ భవితకు బంగరు బాటలు పరిచిన విజనరీకి వందనం చేసింది. వందనం చేయటమే కాదు. గళం విప్పి గర్జించింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో, అత్యధికులు యువకులు. చంద్రబాబు విజన్ వల్లే తాము ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నామనీ, అందుకే ఆయనకు కృతజ్ణతలు తెలపుకోవడంతో పాటు ఆయన అక్రమ అరెస్టును ఖండించి ఆయను సంఘీభావంగా నిలబడేందుకే వచ్చామని ఎలుగెత్తి చాటారు. వేలాది ఐటీ ఉద్యోగులు.. చంద్రబాబుకు జై కోట్టారు.. సీబీఎన్ జిందాబాద్.. మేము సైతం బాబు కోసం లాంటి స్లోగన్లు చేశారు.
హైదరాబాద్ లోని హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ను నిర్మించి పాతికేళ్లు అయిన సందర్భంగా.. ఐటీ రంగానికి బీజం వేసిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమలో పలువురు మాట్లాడిన మాటలు.. చేసిన ప్రసంగాలు చంద్రబాబు గొప్పతనం మరోమారు కళ్ల ముందు సాక్షాత్కారమయ్యేలా చేశాయి.
ఆయన ముందు చూపుతో నాటిన విత్తు ఈరోజు ఏ విధంగా మహా వృక్షమై, తమవంటి లక్షల మందికి ఎలా నీడను అందిస్తున్నదో, దేశ విదేశాల్లో తాము సాధించిన విజయాలకు చంద్రబాబు నాయుడు ఏవిధంగా ఆదర్శంగా నిలిచారో వివరించారు. అలాగే చంద్రబాబు నాయుడు నడకను, నడతను దగ్గర నుంచి చూసిన పెద్దలు, ఆయనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించారు. ఎక్కడా రాజకీయ ప్రసంగాలు లేకుండానే ఐటీ ఉద్యోగులు చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్టు చేయడం ఎంత దుర్మార్గమో చాటారు. జగన్ అరాచకత్వంపై, అడ్డగోలు విధానాలపై జనంలో ఆగ్రహం కట్టలు తెంచుకుని బయటకు రావడానికి కారణమయ్యారు. ఆ గ్రాటిట్యూడ్ సభతో జగన్ పతనానికి బీజం పడిందని చెప్పవచ్చు.