శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదరింపు | bomb threat to shamshabad| three| flights| cisf| inspect| confirm
posted on Oct 30, 2024 9:52AM
ఇటీవలి కాలంలో విమానాల్లో బాంబులు పెట్టామంటూ బెదరింపు కాల్స్ రావడం ఎక్కువైంది. గత కొన్ని రోజులుగా విమానాశ్రయాలకు బాంబు బెదరింపు కాల్స్ వస్తున్నాయి. తాజాగా బుధవారం (అక్టోబర్ 30) శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయానికీ బాంబు బెదరింపు కాల్ వచ్చింది. విమానాశ్రయంలోని మూడు విమానాలలో బాంబులు ఉన్నాయంటూ బెదరింపు కాల్స్ రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
వెంటనే ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాల్లో సీఐఎస్ఎఫ్ సిబ్బంది తనిఖీలు చేశారు. చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలకు, చెన్నై నుంచి వచ్చిన ఓ విమానంకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. వెంటనే విమానాశ్రయం సెక్యూరిటీ సిబ్బంది విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. ఎటువంటి బాంబులూ లేవని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ బెదరింపు కాల్ కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెన్నై వెళ్లాల్సిన విమానాల టేకాఫ్ జాప్యం అయ్యింది. ఇలా ఉండగా విమానాశ్రయాలకు ఇటీవల వరుస బెదరింపు కాల్స్ రావడాన్ని కేంద్రం సీరియస్ గా తీసుకుంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ బెదరింపు కాల్స్ పై లోతైనా విచారణకు ఆదేశించారు.