Leading News Portal in Telugu

బీసీ కుల‌ గ‌ణ‌నతో కాంగ్రెస్ బిగ్ స్కెచ్‌.. బీఆర్ఎస్‌కు షాక్ త‌ప్ప‌దా? | bc sensus| congress| big| sketch| weaken| brs|next| elections| win


posted on Nov 4, 2024 4:17AM

 

తెలంగాణ‌లో హ‌స్తం పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని బీసీ జ‌పంతో ఇప్ప‌టి నుంచే టార్గెట్ ఫిక్స్ చేసుకొని ప‌నిచేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీ ప్ర‌కారం.. బీసీ కుల‌గ‌ణ‌న చేప‌ట్టేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. కుల‌ గ‌ణ‌న పూర్తి చేసి తెలంగాణ నుంచి స‌రికొత్త పొలిటిక‌ల్ వార్ కు శ్రీ‌కారం చుట్టాల‌ని వ్యూహాలు ర‌చిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కుల‌ గ‌ణ‌న‌కు టాప్ ప్ర‌యారిటీ ఇస్తున్నారు. నిత్యం స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ స‌త్వ‌ర నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తాజాగా హైకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్ర‌త్యేక క‌మిష‌న్ ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను సీఎం రేవంత్ ఆదేశించారు.

అయితే, కేవ‌లం కుల‌గ‌ణ‌న‌కే ప‌రిమితం కాకుండా రాష్ట్రంలోని బీసీ వ‌ర్గాలను కాంగ్రెస్ పార్టీ వైపున‌కు తిప్పుకొనేందుకు గ్రౌండ్ వ‌ర్క్ కూడా రేవంత్ టీం సిద్ధం చేసుకున్న‌ట్లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతున్నది. వాస్త‌వానికి బీసీ కుల‌గ‌ణ‌న ద్వారా ఆ వ‌ర్గాల వారికి ల‌బ్ధి చేకూరుతుంది. ఈ క్ర‌మంలో ఆ వర్గాల్లోని మెజార్టీ ప్ర‌జ‌ల‌ను కాంగ్రెస్ వైపు షిఫ్ట్ చేసుకునేందుకు ప‌క్కా ప్లాన్ ను కూడా కాంగ్రెస్ అమ‌లు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, రేవంత్ స‌ర్కార్‌ వ్యూహం ఆ పార్టీకి ఏ మేర‌కు లాభిస్తుంద‌నే అంశంపైనా కాంగ్రెస్‌ వ‌ర్గాల్లో విస్తృత‌ చ‌ర్చ  జ‌రుగుతున్నది.

ఈ ఏడాది చివ‌రిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు కాంగ్రెస్ ప్ర‌భ‌త్వం సిద్ధ‌మ‌వుతోంది. ఈ విష‌యంపై  రెండు రోజుల కిందట మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి   కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. డిసెంబ‌ర్ నెల‌లో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతాయ‌ని, సంక్రాంతి నాటికి కొత్త పాల‌క వ‌ర్గం కొలువుదీరుతుంద‌ని చెప్పారు. అదే క్ర‌మంలో  ఈనెల 6న బీసీ కులగ‌ణ‌న ప్రారంభించి ఈ నెల 31వ తేదీలోగా పూర్తి చేయాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ మేర‌కు కార్యాచ‌ర‌ణ‌ను సిద్ధం చేసుకుంది. డిసెంబ‌ర్‌లో పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ప్ర‌భుత్వం ప్లాన్ చేస్తుండ‌గా.. ఆ ఎన్నిక‌ల్లో బీసీల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. అదే స‌మ‌యంలో బీసీ గ‌ణ‌న ద్వారా బీసీల‌కు జ‌రిగే ల‌బ్ధిని ప్ర‌తీ గ్రామంలో తెలియ‌జేయాల‌ని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోంది. గ్రామ క‌మిటీల ద్వారా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని జిల్లా స్థాయి నేత‌ల‌కు పార్టీ పెద్ద‌లు ఇప్ప‌టికే ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలిసింది. మ‌రో వైపు గ‌త ఎన్నిక‌ల ప్ర‌చారంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. జ‌నాభాలో ఎక్కువ శాతం ఉన్న బీసీల‌కు ఆ స్థాయిలో ల‌బ్ధిచేకూరేలా చేస్తామ‌ని హామీ ఇచ్చారు. జ‌నాభా లెక్క‌ల ప్ర‌కారం బీసీల రిజ‌ర్వేష‌న్లు పెంచుతామ‌ని, నిధులు కూడా జ‌నాభా ప్ర‌కారం ఆ వ‌ర్గాల‌కు ఖ‌ర్చు పెడ‌తామ‌ని అన్నారు.

 బీసీ కుల‌గ‌ణ‌న‌తో రేవంత్ స‌ర్కార్ మ‌రో బిగ్ ప్లాన్ ను అమ‌లు చేయ‌బోతున్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగు తున్నది. తెలంగాణ‌లో బీసీ వ‌ర్గాల్లోని ప్ర‌జ‌లు ఎక్కువ శాతం మంది బీఆర్ఎస్ కు మ‌ద్ద‌తుగా ఉన్నారు. కేసీఆర్‌ ప‌దేళ్ల పాల‌న‌లో బీసీల‌కు ప‌లు ప‌థ‌కాల‌ను అమ‌లు చేసి వారు ఆర్థికంగా బ‌లోపేతం అయ్యేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే, ఆ ప‌థ‌కాల ఫ‌లాలు కింది స్థాయిలో ల‌బ్ధిదారుల‌కు అందే విష‌యంలో కొంత గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. ముఖ్యంగా గొర్రెల పంపిణీ ప‌థ‌కం విష‌యంలో భారీ అవినీతి అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి.

ప్ర‌స్తుతం రేవంత్ స‌ర్కార్ ఆ ప‌థ‌కంలో అవినీతిపై విచార‌ణ జ‌రుపుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ మెజార్టీ బీసీలు బీఆర్ఎస్ వైపే మొగ్గుచూపారు. అయితే, వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి బీసీల్లోని 60శాతానికి పైగా ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మ‌ళ్లించేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో బీఆర్ఎస్ పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీల‌ను దూరం చేయ‌డం ద్వారా ఆ పార్టీని బ‌ల‌హీన ప‌రచాలన్నదే కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది‌. తెలంగాణ‌లో మొద‌టి నుంచి ఎస్సీ సామాజిక వ‌ర్గం, రెడ్డి సామాజిక వ‌ర్గం ఓట‌ర్లు కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మెజార్టీ బీసీ ఓట‌ర్ల‌ను కాంగ్రెస్ పార్టీ వైపున‌కు తిప్పుకుంటే మ‌రోసారి అధికారంలోకి రావ‌డం ఈజీ అవుతుంద‌ని కాంగ్రెస్ పెద్ద‌లు భావిస్తున్నారు‌. మ‌రి హ‌స్తం పార్టీ నేత‌ల అంచ‌నాలు ఏమేర‌కు నిజ‌మ‌వుతాయో వేచి చూడాల్సిందే.