హే జగన్నాథా.. అవినీతి సొమ్ములోనూ వాటాల గొడవా? | jagan and sharmila dispute in Corruption money| cases| ed| it
posted on Nov 4, 2024 11:21AM
ముందు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, ఆ తరువాత తన అధికార మదంతో కొట్లకు పడగలెత్తిన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అడ్డగోలు అక్రమ సంపాదనంతా తన కష్టార్జితమని నిస్సిగ్గుగా చెప్పుకోగలిగిన ధీశాలి కూడా ఆయనే. 2009 నుంచి 2024 మధ్య కాలంలో ఆయన ఆస్తులు వందల రెట్లు ఎలా పెరిగాయన్నది చిదంబర రహస్యమే. స్వేదం చిందించి, కంపెనీలు పెట్టి ఆస్తులను కూడబెట్టానని చెప్పుకుంటున్న జగన్.. 2009 ఎన్నికలకు ముందు కేవలం పది లక్సల రూపాయలలోపు ఆదాయం మాత్రమే ఉన్న వ్యక్తి 2024 నాటికి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టగలిగారన్నది చిదంబర రహస్యమే.
జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో వివరాల మేరకు ఆయన పేరుమీద సేవింగ్స్ అక్కౌంట్ లో అప్పట్లో లక్షా 93 వేల 797 రూపాయలు ఉన్నాయి. అలాగే ఆయన భార్య విజయలక్ష్మి సేవింగ్స్ అక్కౌంట్లో నాలుగు లక్షల 54 వేల 663 రూపాయలు ఉన్నాయి. ఇంకా ఆమె పేరుపై సెవింగ్స్ 40 లక్షల రూపాయల ఫిక్సెడ్ డిపాజిట్ ఉంది. ఇంకా వైయస్ పేరు మీద షేర్ మార్కెట్ లో 20 లక్షల రూపాయలు, ఆయన భార్య పేరు మీద 35 లక్షల 25 వేల రూపాయల విలువ చేసే షేర్లు ఉన్నాయి. అలాగే ఇద్దరి పేరు మీద చెరొక అరకేజీ అంటే మొత్తం కేజీ బంగారం ఉంది. ఇవి కాక కడప జిల్లా ఇడుపులపాయలో 39.52 సెంట్లు, అర ఎకరం తక్కువ 40 ఎకరాల భూమి ఉంది. అలాగే పులివెందుల పట్టణం రాజారెడ్డి స్ట్రీట్ లో 83 గజాల స్థలం వుంది. ఇది వైఎస్ 2009లో కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో ఉన్న ఆస్తులు. వైఎస్ కు అప్పట్లో కనీసం కారు కూడా లేదు.
సరే 2004లో వైఎస్ సీఎం కా కముందు ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదాయపన్ను శాఖకు చూపించిన ఆస్తి కేవలం పది లక్షల రూపాయలు మాత్రమే. అయితే తండ్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన తరువాత జగన్ ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి. 2011 లో కడప లోక్ సభ స్థానానికి జగన్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ సమయంలో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తి విలువ అక్షరాలా 365 కోట్లు. ఇక ఆయన భార్య భారతి పేరు మీద ఉన్న ఆస్తి విలువ 41 కోట్ల రూపాయలు. తండ్రి అధికారంలోకి రాక ముందు అంటే 2004 కు ముందు కేవలం పది లక్షల లోపు ఆదాయం చూపిన వ్యక్తి 2011 నాటికి వందలకోట్లు ఎలా కూడబెట్టగలిగారన్నది చిదంబర రహస్యమే కదా? తన వ్యాపార విజయ రహస్యం జగన్ దంపతులే వెల్లడించాలి. లేదా అక్రమాస్తుల కేసుల విచారణలో నిగ్గు తేలాలి. అది పక్కన పెడితే 13 ఏళ్ల కిందటే జగన్ 43 వేల కోట్ల ఆర్థిక నేరాలకు పాల్పడ్డారాని ఈడీ, సీబీఐలు కోర్టుకు తెలిపాయి. ఇప్పుడు అదిలక్ష కోట్లు దాటేసింది. ఇక జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క మద్యం, మట్టి , మైనింగ్ ఇసుక అక్రమ వసూళ్ళు ఎంత ఉంటాయన్నది ఎవరి ఊహకు కూడా అందదు.
అటువంటి జగన్ ఇప్పుడు చెల్లెలు షర్మిలతో ఆస్తుల విషయంలో గొడవ పడుతున్నారు. తనకు రాజకీయంగా నష్టం కలిగించేలా వ్యవహరిస్తోంది కనుక చెల్లెలు షర్మిలకు ఆస్తుల్లో వాటా ఇచ్చేది లేదని ఢంకా బజాయించి చెబుతున్నారు. తండ్రి వైఎస్ బతికి ఉండగానే ఆస్తుల పంపకం జరిగిపోయిందని నమ్మబలుకుతున్న జగన్.. ఇప్పుడు షర్మిల కోరుతున్న ఆస్తులు తన కష్టార్జితం అని చెబుతున్నారు. అయితే తల్లి విజయమ్మ మాత్రం కుమారుడు జగన్ చెబుతున్నవన్నీ పచ్చి అబద్ధాలని ఓ బహిరంగ లేఖలో విస్పష్టంగా ప్రకటించారు. దీంతో సొంత పత్రికలో తల్లీ చెల్లిపై వారి వ్యక్తత్వ హననానికి పాల్పడేలా కథనాలు. వారిద్దరూ చంద్రబాబు చెప్పినట్లల్లా చేస్తున్నారంటూ అభాండాలు.
మొత్తంగా షర్మిలతో ఆస్తుల వివాదంలో జగన్ వాదన అబద్ధమన్నది సులువుగా అర్ధమైపోతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చెల్లెలికి ఆస్తుల్లో వాటాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని తల్లి విజయమ్మ కూడా తన బహిరంగ లేఖ ద్వారా జగన్ దుర్మార్గాన్ని బట్టబయలు చేసేశారు. అయినా శత్రువుతో కుమ్మక్కు అంటూ తల్లి, చెల్లెలిపై విమర్శలు గుప్పిస్తూ జగన్ ఎవరిని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారో అర్ధం కావడం లేదని అంటున్నారు. సొంత పత్రికలో ఏం రాసినా అడిగేవాళ్లు ఉండరన్నట్లుగా ఆయన మాటలు చేతలు ఉన్నాయని అంటున్నారు. అయినా ఎనిమిది ఈడీ కేసులు, 11సీబీఐ కేసులు, 13 ఐటీ కేసుల్లో ఏ1 గా ఉన్న జగన్ మోహన్ రెడ్డి వందల కోట్ల ఆస్తులను చెమటోడ్చి సంపాదించానంటే నమ్మెదేలా అని జనం అంటున్నారు. అయినా పిచ్చి కాకపోతే ఆస్తే అవినీతి అయినప్పుడు నీతిగా పంచమని అడుగుతారేంటి?