Leading News Portal in Telugu

ప్రొటోకాల్ పాటించని అధికారులు.. సమీక్షా సమావేశం నుంచి వేమిరెడ్డి వాకౌట్ | vemireddy walk out| officers| fail| maintain| protocol| ignore| nellore| mp| prabhakar


posted on Nov 4, 2024 11:49AM

తెలుగుదేశం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి కోపం వచ్చింది.  నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశం నుంచి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వాకౌట్ చేశారు. తనకు సముచిత గౌరవం లభించలేదన్న ఆగ్రహంతో ఆయన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో ఆదివారం (నవంబర్ 3) జిల్లా సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  సమావేశం ప్రారంభించిన ఆర్డీవో సమావేశానికి వచ్చిన ప్రజా ప్రతినిథులకు బొకెలు అందజేశారు.

అయితే మంత్రులు, ఎమ్మెల్యేలకు బొకేలు అందించి సభకు పరిచయం చేసిన ఆర్డీవో, ఎంపీ వేమిరెడ్డిని మాత్రం విస్మరించారు. దీంతో వేమిరెడ్డికి ఆగ్రహం వచ్చింది. అంతే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎంత సముదాయించినా.. గౌరవం లేని చోట ఉండలేనంటూ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఆయనతో పాటు ఆయన సతీమణి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూడా భర్తతో పాటు సమావేశం నుంచి వెళ్లి పోయారు. ఇదేమీ చిన్న విషయం కాదు. వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరడానికి కారణమే వైసీపీలో తనకు గౌరవం లభించడం లేదని. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా పలు సందర్భాలలో చెప్పారు. 

వేమిరెడ్డి వంటి స్టేచర్ ఉన్న వ్యక్తులు పదవులు, హోదాల కంటే రెస్పెక్ట్ ఉండాలని భావిస్తారు. వైసీపీలో అలా రెస్పెక్ట్ దొరకలేదనే  ఆయన పార్టీ వీడారు.  ఇప్పుడు అదే పరిస్థితి తెలుగుదేశంలో కూడా ఆయనకు ఎదురౌతోందని భావిస్తున్నారు. ఎంపీనైన తనను అధికారులు గుర్తించకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆయనను సముదాయించేందుకు ఆనం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అధికారులు తనను అవమానించారనీ, ఇంకెప్పుడూ సమీక్షా సమావేశానికి వచ్చేది లేదని వేమిరెడ్డి కుండబద్దలు కొట్టేశారు. అంతా అయిపోయిన తరువాత ఆనం రామనారాయణరెడ్డి అధికారలు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటిది పునరావృతం కాకూడదని ఆదేశించారు.  

తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాష్ట్ర పురోభివృద్ధి విషయంలో వంక పెట్టడానికి వీల్లేకుండా పని చేస్తున్నది. ఈ విషయంలో చంద్రబాబు చాలా స్పష్టంగా ఉన్నారు. ఎక్కడైనా నేతలూ అధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తుంటే వెంటనే కరెక్ట్ చేస్తున్నారు. అదే సమయంలో నేతలకు సముచిత గౌరవం దక్కే విషయంపై కూడా దృష్టి పెట్టాలి. నేడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డికి జరిగినట్లు మరో రోజు మరో నేతకు  జరగకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వేమిరెడ్డి విషయంలో జరిగింది పొరపాటు మాత్రమేననీ, మరోసారి పునరావృతం కాదనీ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఆయనకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. చిన్న విషయమే కదా అని వదిలేస్తే ముందు ముందు ఇదో ఆనవాయితీగా మారిపోయే ప్రమాదం ఉంది. ప్రొటోకాల్ ను ఉల్లంఘించిన అధికారులపై చర్యలు తీసుకుని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.