అరెస్టు ప్రచారంలో నిజమెంత?.. బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? | brs social media predict key leader arrest| how| true| sympathy
posted on Nov 4, 2024 3:05PM
అధికారంలో ఉన్నంత కాలం పట్టపగ్గాల్లేకుండా వ్యవహరించిన బీఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణలో తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి ఎదుర్కొంటున్న సవాళ్లతో పార్టీ ఉనికే ప్రమాదంలో పడిన పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ ఓటమి తరువాత బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి కూడా డుమ్మా కొట్టి మరీ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యారు. పార్టీ నేతలకు కూడా అందుబాటులోకి రావడం లేదు. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం బయటకు వచ్చినప్పటికీ.. ఆ ఎన్నికల్లో పార్టీ జీరో ఫలితాన్ని సాధించడంతో ప్రజలకు పూర్తిగా మొహం చాటేశారు. మరి కొంత కాలం ఆయన ఇదే విధంగా అజ్ణాత వాతం కొనసాగిస్తే.. జనం ఆయనను మరచిపోయే ప్రమాదం ఉందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.
కేసీఆర్ ఆబ్సెన్స్ లో పార్టీని ఆయన కుమారుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఏదో విధంగా నడుపుతున్నారు. అయితే ఆయన ఎక్కువగా సామాజిక మాధ్యమంపై ఆధారపడతారు. ఈ నేపథ్యంలో పార్టీ సోషల్ మీడియా వింగ్ పైనే ఆయన ఎక్కువగా ఆధారపడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై అవగాహన కంటే సోషల్ మీడియాలో వైరల్ అయితేనే లాభం అన్నట్లుగా కేటీఆర్ వ్యవహార శైలి ఉందన్న విమర్శలు పార్టీలోనే ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే సింపతీ గెయినింగ్ ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ లో త్వరలో అంటే ఇహనో ఇప్పుడో ఓ కీలక నేత అరెస్టునకు రేవంత్ సర్కార్ కుట్ర పన్నిందన్న సమాచారం బాగా వైరల్ అవుతోంది. స్వయంగా కేటీఆర్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అయితే ఆ అరెస్టు ద్వారా తన ఏడాది పాలనా వైఫల్యాల నుంచి జనం దృష్టి మరల్చాలని రేవంత్ భావిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. అయితే ఈ కీలక అరెస్టు అన్నది ఎంత వ రకూ నిజమో ఎవరికీ తెలియదు కానీ బీఆర్ఎస్ మాత్రం దీనికి విపరీతంగా ప్రచారం ఇస్తోంది. తద్వారా ప్రజల నుంచి సానుభూతిని మద్దతును కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తోంది.