అధికారంలో ఉన్నామా.. ప్రతిపక్షంలో ఉన్నామా? | tdp kutami mlas neglet voter regestration| graduate| mlc| elections| ycp| speed| cbn
posted on Nov 4, 2024 4:13PM
రాష్ట్రంలో ఎమ్మెల్సీ, స్థానిక సంస్థలు ఇలా ఏ ఎన్నికలు వచ్చినా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతల హవా వేరే లెవల్ లో ఉంటుంది. ఓటర్లను నమోదు చేయించడం దగ్గర నుంచీ అన్నివిధాలా ప్రతిపక్ష పార్టీ కంటే పది అడుగులు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ముందుంటారు. కానీ ప్రస్తుతం ఏపీలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. ఏపీలో ఉమ్మడి కృష్ణా- గుంటూరు, ఉమ్మడి తూర్పు- పశ్చిమగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జరగనున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం కూటమి అభ్యర్థులను ప్ ప్రకటించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా, గుంటూరు అభ్యర్థిని ప్రకటించింది, తెలుగేశం కూటమి నుంచి ఉమ్మడి కృష్ణా- గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, అలాగే ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పేరాబత్తుల రాజశేఖర్ పేరును సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే, అక్టోబరు 1 నుంచి నవంబరు 6 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో ఓటర్ల నమోదు అత్యంత కీలకం. కానీ, ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో పట్టభద్రులను ఓటర్లుగా చేర్పడంలో కూటమి ఎమ్మెల్యేలు, నేతలు విఫమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఓటర్ల నమోదుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. కానీ, కూటమి నేతల నిర్లక్ష్యం కారణంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 3.5లక్షల ఓట్లకు గాను లక్ష మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు. అదేవిధంగా ఉమ్మడి కృష్ణా – గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గంలో 3.5లక్షల మంది ఉంటే కేవలం 1.50లక్షల మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారు.
వారం రోజుల క్రితం సీఎం చంద్రబాబు రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా కూటమి పార్టీల్లోని నేతలు కలిసి పనిచేయాలని సూచించారు. 6వ తేదీ వరకు ఓట్ల నమోదు ప్రక్రియ పూర్తవుతుందని, ఆ లోపు ఓటర్ల నమోదును పూర్తి చేయాలని ఆదేశించారు. కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్యనేతలు పట్టభద్రుల ఓట్లను చేర్పించడంపై పెద్దగా దృష్టిసారించడం లేదు. రాష్ట్ర స్థాయి నేతలు నియోజకవర్గ నేతలకు ఇచ్చిన ఆదేశం ఒకటి, ఆచరణలో జరుగుతున్నది ఇంకొకటి. పరస్పర సమన్వయలోపం బహిర్గతమవుతోంది. ఉభయగోదావరి పట్టభద్రుల నియోజకవ ర్గంలో గతంలో మూడు లక్షలకుపైబడి ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఓటర్ల చేర్పింపులో మాత్రం కూటమి నేతలు నిర్లిప్తంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు కూటమి నేతల మధ్య కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయం లేకపోవడం కూడా ఓటర్ల నమోదులో వెనుకబాటుకు దారితీసిందని తెలుస్తోంది. గ్రాడ్యుయేట్స్ ఎక్కువగా ఉన్న ఏలూరు కార్పొరేషన్‌తో సహా మునిసిపాలిటీలు భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, తాడేపల్లి గూడెం వంటి ముఖ్యప్రాంతాలలో ఓటర్ల నమోదు అత్యధికంగా సాగాలని పక్షం రోజుల క్రితమే మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో ఏలూరులో ప్రత్యేక సమావేశం జరిగింది. కానీ ఆ తరువాత ఓట్ల నమోదులో పార్టీల నేతలు ఆశించిన స్థాయిలో శ్రద్ద చూపడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అధిక శాతం కూటమి ఎమ్మెల్యేలే ఉన్నారు. అయినా పట్టభద్రుల ఓట్ల నమోదులో వెనుకబటం వారి నిర్లక్ష్యాన్ని ఎత్తుచూపుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు ఎమ్మెల్యేలు తమ సొంత పనులపై దృష్టి పెట్టడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొందన్న వాదనలు ఉన్నాయి. పట్టభద్రుల ఓట్ల నమోదులో వెనుకబడటంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆయా నియోజకవర్గాల్లోని ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇలా అయితే, రాబోయే కాలంలో కఠిన చర్యలు ఉంటాయని.. వచ్చే రెండు రోజుల్లో అనుకున్న స్థాయిలో పట్టభద్రుల ఓట్ల నమోదు జరగాలని ఆదేశించినట్లు సమాచారం.
ఇలా ఉండగా తెలుగుదేశం కూటమి పార్టీల్లోని నిర్లిప్తతను ఆసరాగా చేసుకుని వైసీపీ పట్టభద్రుల ఓట్ల నమోదు విషయంలో దూకుడుగా వెడుతున్నది.
వాస్తవానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న రెండు చోట్లా కూడా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ జీరో రిజల్ట్ సాధించింది. అయినా కూడా ఓట్ల నమోదు విషయంలో దూకుడుమీద వెడుతూ పైచేయి సాధిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. దీంతో తాజాగా చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ లో తెలుగుదేశం ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచంద్రాపురం ఎమ్మెల్యే వాసంశెట్టి సుభాష్ ను అయితే నేరుగా రాజకీయాల పట్ల సీరియస్ లేకపోతే కష్టం అని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోకవర్గాల్లోని కూటమి ఎమ్మెల్యేలు, నేతలు రాబోయే రెండు రోజుల్లో ఏమేరకు ఓటర్లను నమోదు చేయిస్తారో వేచి చూడాల్సిందే.