వలసలు ఆగవు.. వైసీపీ మిగలదు! | leaders goodbye to jagan| ycp| empty| soon| former| ministers| anil| jogi| mekatoti
posted on Nov 5, 2024 9:00AM
ఐదేళ్ల అరాచక పాలనతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్.. అధికారం కోల్పోయిన తరువాత కూడా అదే బాటలో నడుస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటే గిట్టదని చాటి చెబుతున్నారు. అవినీతి సొమ్ము పంపకాలలో తల్లి సోదరితో వచ్చిన తాగాదాపై కూడా రాజకీయం చేస్తూ, తాను రాసిచ్చిన స్క్రిప్టునే చదవాలని పార్టీ నేతలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. సొంత మీడియా, సోషల్ మీడియాలో తల్లీ చెల్లికి వ్యతిరేకంగా వార్తలను గుప్పించడమే కాకుండా, పార్టీ నేతలను కూడా మీడియా సమావేశాలు పెట్టి మరీ వారిని దూషించమని ఆదేశిస్తున్నారు. అయితే వైసీపీలోని మెజారిటీ నేతలు మాత్రం పార్టీ రాజకీయంగా మనుగడ సాగించాలంటే.. మీ ఇంటి విషయాలు ప్రైవేటుగా తేల్చుకోండి.. బజారున పడి మీ పరువుతో పాటు పార్టీ పరువూ తీయకండి అని జగన్ కు చెప్పాలని భావిస్తున్నారు. అయితే ఒకరి మాట వినేరకం కాకపోవడంతో ఆయనతో నేరుగా ఆ విషయం చెప్పలేక, చెప్పినా ఫలితం ఉండదు కనుక.. తమ రాజకీయ భవిష్యత్ కోసం పార్టీని వీడుతున్నారు. అలా వీడుతున్న వారిలో జగన్ హయాంలో ఆయన అండ చూసుకుని ఇష్టారీతిగా రెచ్చిపోయిన వారు, విలువలను వదిలేసి ప్రతిపక్ష నాయకులు, విపక్ష పార్టీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారూ కూడా ఉండటమే విశేషం. జగన్ తానా అనకముందే తందానా అంటూ భజన చేసి ఆయన దృష్టిలో పడాలంటే.. తిట్లు, దూషణలే భాషగా మార్చుకోవాలని భావించి అలా ఇష్టారీతిగా చెలరేగిపోయిన వారు ఇప్పుడు జగన్ కు దూరం జరుగుతున్నారు. అవకాశం ఉంటే కూటమి పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరిపోవాలని చూస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీకి, జగన్ కు గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లో సర్దుకున్నారు. ఇక జగన్ అధికారంలో ఉండగా నోటికి పని చెప్పి, మంచీ చెడు అన్న విచక్షణ మరిచి ఇష్టారీతిగా బూతలతో చెలరేగిపోయిన వారికి కూటమి పార్టీల్లో అవకాశం లేకుండా పోయింది. అటువంటి వారు కూడా జగన్ కు దూరంగా ఉంటే ఇప్పుడు కాకపోతే తరువాతైనా ఏదో ఒక పార్టీలో చోటు దొరుకుతుందన్న ఆశతో పార్టీని వీడే యోచన చేస్తున్నారు. అటువంటి వారిలో ప్రముఖంగా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. వారు మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్.
ముందుగా అనిల్ కుమార్ యాదవ్ గురించి చెప్పుకుంటే… వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు పై నోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్ పార్టీ ఘోర పరాజయం తరువాత ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. పోలింగ్ జరిగిన తరువాత ఒక సారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు. ఆ తరువాత ఆయన ఇక ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రి పదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్ అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందంటూ అప్పట్లో తన స్థాయికి మించిన వ్యాఖ్యలు చేశారు.
ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ఎవరికీ ముఖం చూపలేక చాటేశారు. అటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇప్పుడు తన పరిస్థితి ఇలా కావడానికి కారణంగా వైసీపీ అధినేత జగన్ అని భావిస్తున్నారు. పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నెల్లూరు పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది. అయితే జనసేన తలుపులు ఆయన కోసం తెరుచుకునే అవకాశాలు మృగ్యమని అంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అయితే విపక్షంలో ఉన్న సమయంలోనే అనిల్ అక్రమాలపై జ్యుడీషియల్ కమిషన్ కు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధికారంలో ఉంది కనుక ఇహనో ఇప్పుడో ఆయనపై విచారణకు ఆదేశించే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో మౌనంగా ఉంటే సరిపోదనీ, జగన్ తో విభేదించి బయటకు వచ్చానని చాటుకోవడం ద్వారా కూటమి ఆగ్రహాన్ని కొంతైనా చల్లార్చవచ్చనీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భావిస్తున్నారనీ, అందుకే పార్టీ వీడాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక మరో మాజీ మంత్రి జోగి రమేష్ విషయానికి వస్తే.. వైసీపీ శ్రేణులలో ఆయన పార్టీ మారరన్న విశ్వాసం వ్యక్తం అవుతున్నప్పటికీ జోగి రమేష్ కేసుల చక్రబంధం నుంచి బయటపడాలంటే పార్టీ మారడం తప్ప మరో మార్గం లేదని భావిస్తున్నారని ఆయన అనుయాయులు చెబుతున్నారు. జోగి రమేష్ జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. ఇందులో నిజానిజాలను పక్కన పెడితే జోగి రమేష్ వైసీపీలో కొనసాగే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదు.
వీరిద్దరే కాకుండా వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు మరి కొందరు మాజీలు కూడా రెడీగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తోంది. వలసలు జోరందుకోవడానికి ఎక్కువ రోజులు పట్టదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా వైసీపీకి బైబై చెప్పేసి బయటకు వచ్చే వారి సంఖ్య అధికంగానే ఉంటుందంటున్నారు. అసలు వైసీపీ మిగులుతుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మేకతోటి సుచరిత, విడదల రజిని కూడా ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వారు కూడా నేడో రేపో పార్టీకి గుడ్ బై చెప్పే అవకాశాలున్నాయంటున్నారు.