Leading News Portal in Telugu

నిర్లక్ష్యపు నీడలో ఇనప యుగపు నిలువు రాయ | iron age piller in the shadow of carelessness| pleach| india| ceo| emani


posted on Nov 7, 2024 4:42PM

కాపాడుకోవాలంటున్న శివనాగిరెడ్డి 

నాగర్ కర్నూలు జిల్లా, ఉప్పునుంతల మండలం, కంసానిపల్లె శివారులో దిండి నది ఒడ్డున ఇప్పటికి 3500 సంవత్సరాల నాటి ఇనుపయుగపు నిలువు రాయి నేడోరేపో కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో  డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

వారసత్వ సంపదను కాపాడుకొని, భవిష్యత్ తరాలకు అందించాలన్న ధ్యేయంతో చేపట్టిన అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆయన గురువారం నాడు ఉప్పునుంతల మండల పరిసరాల్లో జరుపుతున్న అన్వేషణలో కొండారెడ్డిపల్లి- ఉప్పునుంతల మార్గంలో దిండినది దాటిన తర్వాత కుడివైపు 100 అడుగుల దూరంలో పొలాల్లోనున్న నిలువు రాతిని ఇనుప యుగంలో మరణించిన ఒక  ప్రముఖుని గుర్తుగా నిర్మించారని, దీన్ని మెన్హీర్ అంటారని ఆయన అన్నారు. ఇంతకు మునుపు ఇక్కడ పెద్ద పెద్ద బండరాళ్లను గుండ్రంగా అమర్చిన అనేక సమాధులు ఉండేవని, వ్యవసాయ భూముల విస్తరణలో అవి తొలగించబడినాయని స్థానిక రైతులు చెప్పారని, ఈ నేపథ్యంలో మిగిలిన ఒకే ఒక నిలువు రాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని శివనాగిరెడ్డి అన్నారు.

భూమిపైన 8 అడుగుల ఎత్తు, 2 అడుగుల వెడల్పు, అడుగున్నర మందం గల ఈ నిలువు రాయి, గ్రానై టు రాతితో తీర్చిదిద్దబడిందని, ఇంత పెద్ద నిలువు రాతిని నిలబెట్టడం అలనాటి సామూహిక శ్రమశక్తికి నిదర్శనమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తిప్పర్తి జగన్మోహన్ రెడ్డి, అభిలాష్ రెడ్డి, బడే సాయికిరణ్ రెడ్డి పాల్గొన్నారని ఆయన చెప్పారు.