Leading News Portal in Telugu

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం.. రేవంత్ రెడ్డి శ‌పథం.. బీఆర్ఎస్ కింకర్తవ్యం! | wount step back from musi cleansing| revanth| reddy| oath| brs| bjp| dilemma


posted on Nov 9, 2024 9:02AM

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అధికారపగ్గాలు చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్ష బీఆర్ఎస్ పై దూకుడుగానే ముందుకెళ్తున్నారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో అధికార బీఆర్ఎస్ పార్టీపై విమ‌ర్శ‌ల దాడి చేసిన రేవంత్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత కూడా అదే ఫార్ములాను అమ‌లు చేస్తున్నారు. త‌ద్వారా రేవంత్ దూకుడుతో  బీఆర్ఎస్ తేలిపోతున్న ప‌రిస్థితి. తెలంగాణ రాజ‌కీయాల్లో ప‌దేళ్లుగా పెద్ద‌దిక్కుగా ఉంటూ వ‌చ్చిన మాజీ సీఎం కేసీఆర్‌ అధికారం కోల్పోయిన త‌రువాత కేవ‌లం త‌న ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. ఒక ప‌క్క అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు కేటీఆర్ ఆధ్వ‌ర్యంలో బీఆర్ఎస్ నేత‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా.. కేసీఆర్  మాత్రం నోరు మెద‌ప‌డం లేదు. దీంతో అధికార కాంగ్రెస్ ను ఎదుర్కోవ‌టంలో బీఆర్ఎస్ ఆశించిన స్థాయిలో స‌ఫ‌లం కావ‌డం లేదు.

దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న బీజేపీ నేత‌లు సైతం ప్ర‌జాస‌మ‌స్య‌లపై గ‌ళ‌మెత్త‌డంలో విఫ‌ల‌మ‌వుతున్నారు.  బీజేపీలో ఒక‌రిద్ద‌రు నేత‌లు మిన‌హా మిగిలిన నేత‌లు రేవంత్ స‌ర్కార్ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపేందుకు అసలు ప్రయత్నమే చేయడం లేదు. తాజాగా హైడ్రా, మూసీ ప్ర‌క్షాళ‌న విష‌యంలోనూ బీఆర్ఎస్ నేతల నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యలోపం  కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే బీజీపీ కూడా మూసీ ప్రక్షాళన, హైడ్రా విషయంలో  ఉదాశీనంగానే ఉంటోందని రాజకీయవర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. 

మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి  (మూసీ నది ప్రక్షాళన) ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్ర‌క్షాళ‌న‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. హైదరాబాద్‌ను వరదల నుంచి రక్షించేందుకు, ఆక్రమణకు గురైన మూసీ నది పరివాహక ప్రాంతాలను పునరుద్ధరించి, కాలుష్య కోరల నుంచి మూసీని కాపాడేందుకు   మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. అధికారులు ముందుగా మూసీ నది ఎఫ్‌టీఎల్‌ పరిధిని సర్వే చేశారు. ఈ సర్వేలో దాదాపు 16 వేల నివాసాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నట్లు తేలింది. అందులో పేద, మధ్యతరగతి వారు నివసిస్తున్నారు. దీంతో ప్రభుత్వం  మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇవ్వాలని   నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే జీఓ కూడా జారీ చేసింది. పోలీసు భద్రత మధ్య కూల్చి వేయాల్సిన ఇళ్లకు అధికారులు మార్క్ వేశారు. ప‌లు ప్రాంతాల్లో ఇళ్ల‌ను   కూల్చివేశారు. దీంతో స్థానికంగా మెజార్టీ ప్ర‌జ‌ల నుంచి తెలంగాణ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌య్యింది. త‌మ ఇళ్ల‌ను కూల్చొద్దంటూ మూసీ బాధితులు ఆందోళ‌న‌కు దిగారు. వారికి అండ‌గా ఉంటామ‌ని బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు హామీలిచ్చారు. కొంద‌రు నేతలు బుల్డోజ‌ర్లు బాధితుల‌ ఇళ్ల‌పైకి వెళ్లాలంటే మ‌మ్మ‌ల్ని దాటుకొని వెళ్లాలంటూ రేవంత్ స‌ర్కార్ కు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. కానీ, రేవంత్ స‌ర్కార్ మాత్రం మూసీ సుంద‌రీక‌ర‌ణ విష‌యంలో ఏమాత్రం వెన‌క్కు త‌గ్గేలా క‌నిపించ‌డం లేదు. 

తాజాగా సీఎం రేవంత్ రెడ్డి త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మూసీ పున‌రుజ్జీవ‌న పాద‌యాత్ర చేప‌ట్టారు. సంగెంలోని మూసీ న‌ది ఒడ్డున ఉన్న శివ‌లింగానికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి యాత్ర‌ను మొద‌లు పెట్టారు. యాదాద్రి జిల్లా వ‌లిగొండ మండ‌లం సంగెం నుంచి భీమ‌లింగం వ‌ర‌కు సుమారు మూడు కిలో మీట‌ర్ల మేర రేవంత్ పాద‌యాత్ర కొన‌సాగింది. అనంత‌రం జ‌రిగిన స‌భ‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మూసీ ప్ర‌క్షాళ‌న చేసి తీరుతామ‌ని, వెన‌క్కు త‌గ్గేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. చారిత్రాత్మ‌క‌మైన ఈ ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని చూస్తే కేసీఆర్ కుక్క‌చావు చ‌స్తార‌ని, కేటీఆర్, హ‌రీశ్ రావుల‌పై బుల్డోజ‌ర్ల‌తో తొక్కుకుంటూ ముందుకు వెళ్తామ‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

ఈ పాద‌యాత్ర కేవ‌లం ట్రైల‌ర్ మాత్ర‌మే.. అస‌లు సినిమా ముందుందని రేవంత్ పేర్కొన్నారు. 2025 జనవరి మొదటి వారంలో వాడపల్లి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర మొదలు పెడతానని, ముఫ్పై రోజుల్లో మూసి ప్రక్షాళన ప్రాజెక్టు డిజైన్లు ఖరారు అవుతాయన్నారు. ఒక విధంగా చెప్పాలంటే సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్ర‌మంలో వారు ఎలా రియాక్ట్ అవుతార‌నే విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది. 

మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న అనేది హైద‌రాబాద్ వాసుల‌కు సంతోషించే విష‌య‌మ‌నే చెప్పాలి. గ‌తంలో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఆ మేర‌కు ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అడుగులు ముందుకు ప‌డ‌లేదు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి  మాత్రం ప‌ట్టుద‌ల‌తో ముందుకెళ్తున్నారు. మూసీ ప‌రివాహ‌క ప్రాంతాల్లోని నివాస‌దారుల‌ను ఒప్పించి, వారికి డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు క‌ట్టిస్తామనీ,  మూసీ ప్ర‌క్షాళ‌న విషయంలో మాత్రం వెనకడుగు లేదనీ విస్ఫష్టంగా చెబుతున్నారు.  అయితే, స్థానికంగా ప్ర‌జ‌ల నుంచి ప్ర‌భుత్వం తీరుపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతున్నది. మ‌రో ఏడాదిన్న‌ర‌లో గ్రేట‌ర్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో  మూసీ న‌ది ప్ర‌క్షాళ‌నతో పార్టీకి న‌ష్టం వాటిళ్లుతుంద‌ని కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల్లో ఆందోళ‌న నెల‌కొంది. అయినా సీఎం రేవంత్ ఎక్క‌డా వెన‌క‌డుగు వేసేందుకు ఇష్ట‌ప‌డటం లేదు. మ‌రోవైపు మూసీ బాధితుల త‌ర‌పున పోరాటం చేసేందుకు ప్ర‌తిప‌క్షాలు ముందుకొచ్చిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం దూకుడు ముందు నిల‌వ‌లేక పోతున్నాయి. తాజాగా సీఎం రేవంత్ వ్యాఖ్యల‌తో మూసీ న‌ది ప్ర‌క్షాళ‌న ప‌నులువేగం పుంజుకోనుంది. అయితే, విపక్ష పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్ రేవంత్ దూకుడుకు ఏ మేర‌కు అడ్డుక‌ట్ట వేస్తాయి, మూసీ బాధితుల‌కు ఏ మేర‌కు అండ‌గా నిలుస్తాయ‌నేది వేచి చూడాల్సిందే.