సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం | justice sanjeevkhanna swornin as cji| president| drauoati
posted on Nov 11, 2024 9:04AM
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం (నవంబర్ 11) ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారం (నవంబర్ 10) తో ముగిసిన సంగతి విదితమే. ఆయన స్థానంలో 2019 జనవరి నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాఎంపికైన సంగతి విదితమే.
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన సంజీవ్ ఖన్నా వచ్చే ఏడాది మే వరకూ ఆ స్థానంలో కొనసాగుతారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా గతంలో పలు కీలక కేసులలో చారిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఈవీఎంల పవిత్రతతోపాటు ఎన్నికల బాండ్ల రద్దు, 370 ఆర్టికల్ రద్దు, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ వంటి కేసుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా తీరులు వెలువరించారు.
1960 మే 14న జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. నేషనల్ లీగల్ సర్వీస్ అధారిటీ (ఎన్ఏఎల్ఎస్ఏ) ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా పని చేశారు. 1983లలో న్యాయవాదిగా ఢిల్లీ బార్ కౌన్సిల్ లో పేరు రిజిస్టర్ చేసుకున్నారు. తొలుత తీస్ హజారీ కాంప్లెక్సులోని జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. సుదీర్ఘకాలం ఆదాయం పన్ను విభాగం సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ గా కొనసాగిన సంజీవ్ ఖన్నా 2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ స్టాండింగ్ కౌన్సిల్ (సివిల్)గా నియమితులయ్యారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన సంజీవ్ ఖన్నా.. తదుపరి ఏడాది శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ పొందారు.