Leading News Portal in Telugu

కారు నడిపిన కేసీఆర్.. సంకేతమేంటి? | kcr drives car in farmhouse| indication| active| politics


posted on Nov 11, 2024 8:56AM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారు నడిపారు. ఔను తన ఫామ్ హౌస్ లో బెంజ్ కారు నడిపి అందుకు సంబంధించిన ఫొటోలను విడుదల చేశారు. ఇప్పుడా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయంగా దాదాపు కనుమరుగయ్యారు. రాజకీయంగా పూర్తిగా ఇన్ యాక్టివ్ అయ్యారు. మీడియాకే కాదు, పార్టీ నేతలకు, శ్రేణులకూ కూడా అందుబాటులో లేకుండా పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు.

దీంతో పార్టీ  శ్రేణులలో తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం అవుతోంది. పలువురు ఎమ్మెల్యేలు, నేతలూ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. కేటీఆర్, హరీష్ రావులు రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఆందోళనలలు చేపడుతున్నప్పటికీ, అవి పెద్దగా ప్రభావమంతంగా లేవు. కేసీఆర్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనక పోవడం, అసలు రాజకీయాలను వదిలేశారా అన్నట్లు వ్యవహరిస్తుండటంతో కార్యకర్తలలో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటీవల కేసీఆర్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో వచ్చే ఏడాది జనవరి నుంచీ తాను పార్టీ వ్యవహారాలను సీరియస్ గా పట్టించుకుంటాననీ, రాజకీయంగా క్రియాశీలంగా వ్యవహరిస్తాననీ ప్రకటించారు. ప్రజలకు ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల మధ్య తేడా స్పష్టంగా తెలిసిందన్నారు. రేవంత్ సర్కార్ కు కొంత సమయం ఇద్దామన్న ఉద్దేశంతోనే ఇంత కాలం మౌనంగా ఉన్నానని చెప్పిన కేసీఆర్.. ఇక నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాననీ చెప్పారు. దీంతో క్యాడర్ లో ఉత్సాహం నెలకొంది.

అయితే కొందరు పార్టీ నేతలు మాత్రం కేసీఆర్ అన్నట్లుగా వచ్చే ఏడాది జనవరిని నుంచీ క్రీయాశీలంగా ఉంటారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పార్టీ పరాజయం తరువాత ఆయన ఒకే ఒక రోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అదీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు. ఆ రోజు రేవంత్ సర్కార్ బడ్జెట్ పై విమర్శలు గుప్పించిన కేసీఆర్.. ఆ తరువాత సైలెంటైపోయారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యం కొనుగోళ్లు ఇలా ఏ కీలక అంశంపైనా ఇప్పటి వరకూ నోరు విప్పలేదు. ఈ నేపథ్యంలోనే ఆయన మళ్లీ క్రియాశీలం అవునానని ప్రకటించినా పార్టీ నేతలలో కొందరికి నమ్మకం కుదరడం లేదు. 

ఈ నేపథ్యంలోనే ఆయన ఫామ్ హౌస్ లో కారు నడిపారు. తద్వారా గ్యారేజీలోంచి కారును బయటకు తీసుకువస్తాననీ, ఇక కారు స్పీడ్ తో కాంగ్రెస్ సర్కార్ బెంబేలెత్తిపోవడం ఖాయమనీ సంకేతాలిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  టైగర్ ఈజ్ బ్యాక్  బీఆర్ఎస్ శ్రేణులు సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతూ సంబరాలు చేసుకుంటున్నారు.  ఇక కారు జోరును అడ్డుకోవడం రేవంత్ వల్ల కాదని వ్యాఖ్యలు చేస్తున్నారు.