Leading News Portal in Telugu

ఇప్పుడిక పోసాని వంతు! | now it is posani turn| rajahmundry| janasena| leaders


posted on Nov 12, 2024 9:09AM

అధికారం అండతో     సామాజిక మాధ్యమంలో ఇష్టారీతిగా చెలరేగిపోయి, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేసిన ఒక్కొక్కరికీ ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. బూతులు, దూషణలే విమర్శలు అన్నట్లుగా చెలరేగిపోయిన వారిపై వరుసగా కేసులు నమోదౌతున్నాయి. జగన్ హయాంలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ అసభ్య, అశ్లీల వ్యాఖ్యలతో ఇష్టారీతిగా వ్యవహరించింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత అలాంటి పోస్టులు పెట్టిన వారిపై చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటికే పలువురిని అరెస్టు చేసింది. ఇంకా పలువురిపై కేసులు నమోదు చేసింది. 

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా కేసు నమోదు చేసింది. సినీమా రంగం నుంచి ఇలా నోటికొచ్చినట్లు మాట్లేడేసిన వారిలో పోసాని కృష్ణ మురళి కూడా ఉన్నారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పోసాని కృష్ణమురళి సైలెంటైపోయారు.  అయితే జనసేన అధినేతపై ఆయన పేలిన అవాకులు, చవాకులను ఆ పార్టీ నేతలూ, పవన్ కల్యాణ్ అభిమానులూ మరిచి పోలేదు. తాజాగా రాజమహేంద్రవరం జనసేన నేతలు పోసాని కృష్ణమురళిపై అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వైసీపీ హయాంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై పోసాని కృష్ణమురళి ఇష్టారీతిన దూషించారనీ, అప్పట్లో తానము పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పిన వారు, ఇప్పుడు సోషల్ మీడియాలో అనుచిత పోస్టుల విషయంలో పోలీసులు సీరియస్ గా స్పందిస్తుండటంతో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. దీంతో ఇక పోసానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి అదుపులోనికి తీసుకుని విచారించే అవకాశం ఉంది.