Leading News Portal in Telugu

డ్రోన్ల వినియోగంతో నేరాలకు అడ్డుకట్ట.. సీబీఎన్ విజన్ కు నిలువెత్తు నిదర్శనం | crimes control through drone technology| cbn| vision| polic| destroy


posted on Nov 12, 2024 11:39AM

టెక్నాలజీని పాలనలో సమర్ధంగా వినియోగించుకోవడం ద్వారా అద్భుత ఫలితాలు సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదే పదే చెప్పడమే కాకుండా ఆచరణలో కూడా చేసి చూపుతారు. తాజాగా ఆయన దార్శనికత, టెక్నాలజీ వినియోగంపై ఆయన దార్శనికతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే సంఘటన ఇది. ఇటీవల అమరావతి డ్రోన్ సమ్మిట్ సందర్భంగా చంద్రబాబు డ్రోన్లను విజిబుల్ పోలీసింగ్ తగ్గించేందుకు వినియోగించుకుంటామని చెప్పిన సంగతి తెలిసిందే.

డ్రోన్ టెక్నాలజీ ఉపయోగించి అసాంఘిక శక్తులను అరికట్టవచ్చని చెప్పారు. ఆయన మాటలు అక్షర సత్యాలని పోలీసులు తాజాగా నిరూపించారు. ఐదెకరాల విస్తీర్ణంలో సాగు అవుతున్న గంజాయిని డ్రోన్ల వినియోగం ద్వారా గుర్తించిన పోలీసులు ఆ గంజాయి పంటను దగ్ధం చేశారు. ఈ సంఘటన  అల్లూరి సీతారామ రాజు జిల్లాలో జరిగింది. జిల్లాలోని జీ.మాడుగుల మండలం డేగలరాయి గ్రామంలో ఐదెకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న గంజాయి పంటను డ్రోన్ల వినియోగం ద్వారా గుర్తించారు. వెంటనే దానిని దగ్ధం చేశారు. అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలకు సమాయత్తమౌతున్నారు.

తాజా సంఘటన చంద్రబాబు దార్శనికతకు అద్దం పడుతోంది. టెక్నాలజీ వినియోగంలో చంద్రబాబు అందరికంటే ముందుంటారనేందుకు ఇదో నిదర్శనమని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంత కంటే ముందు గతంలో ఎన్నడూ లేని విధంగా బెజవాడ వరద బాధితులకు ఆహారం, నీరు అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్లను వినియోగించింది. వరద బాధితులను డ్రోన్ల సహాయంతో ఆదుకోవడం అదే తొలిసారి. టెక్నాలజీని సమాజహితం కోసం వినియోగించే విషయంలో చంద్రబాబు అందరికంటే ముందుంటారనడానికి ఇవే తాజా ఉదాహరణలని అంటున్నారు.  విజన్ 2020 ద్వారా ఐటీ రంగం అభివృద్ధిని నాడు అందిపుచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడు విజన్ 2047 ద్వారా భవిష్యత్ భారత్ ను ఇప్పుడే దర్శించి.. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.