Leading News Portal in Telugu

నటి కస్తూరి ముందస్తు బెయిలు పిటిషన్ కొట్టివేత | madras high court dismiss actor kasturi anticipatory bail| contrversial| comments


posted on Nov 14, 2024 12:33PM

తెలుగు వారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నటి కస్తూరి  బెయిలు పిటిషన్ ను  మద్రాసు హైకోర్టు తోసి పచ్చింది.  చెన్నైలో ఈ నెల 3న జరిగిన ఓ కార్యక్రమంలో  నటి కస్తూరి  తమిళ రాజులకు సేవ చేసుకునేందుకు వచ్చిన వారే తెలుగువారనంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ  నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ఆమె క్షమాపణలు చెప్పారు. తాను కొందరిని మాత్రమే ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారనీ, తెలుగువారిని అవమానించలేదనీ వివరణ ఇచ్చారు.

అయితే     తెలుగు సంఘాలు, ప్రముఖులు ఆమె వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  చెన్నై ఎగ్మోర్‌లో ఉన్న తెలుగు సంస్థ ఫిర్యాదు మేరకు కస్తూరిపై పోలీసులు కేసు నమోదు చేసి సమన్లు ఇచ్చేందుకు ఆమె నివాసానికి వెళ్లారు. అయితే  ఇళ్లు తాళం వేసి ఉండటం, ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో  ఆమె పరారీలో ఉన్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తనను అరెస్టు చేయకుండా యాంటిసిపేటరీ బెయిలు ఇవ్వాలని కోరుతూ ఆమె మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.  కోర్టు ఆమె పిటిషన్ ను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఆమెను పోలీసులు ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.