Leading News Portal in Telugu

జగన్ ను నమ్మారు.. జైలు పాలౌతున్నారు! | ycp social media batch shivering with fear| jaim| inevitable| apoligies


posted on Nov 14, 2024 1:54PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా వైసీపీ నేత‌లు, కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ, జ‌న‌సేన పార్టీల అధినేత‌ల‌తోపాటు.. ఆ పార్టీల నేత‌ల‌పై, వారి కుటుంబ స‌భ్యుల‌పైనా సోష‌ల్ మీడియాలో అస‌భ్య‌ పోస్టులు చేశారు. ఇళ్లల్లోని ఆడ‌వారిపైనా నీచాతినీచ‌మైన ప‌ద‌జాలంతో పోస్టులు పెట్ట‌డ‌మే కాకుండా.. ఫొటోల‌ను సైతం మార్ఫింగ్ చేసి మాన‌సికంగా ఇబ్బందికి గురిచేశారు. ఐదేళ్లు వైసీపీ సోష‌ల్ మీడియా  బ్యాచ్ ఆగ‌డాల‌కు అనేక మంది  ఇబ్బందులు పడ్డారు. క‌న్నీళ్లు  పెట్టుకున్నారు. సీఎం హోదాలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అలాంటివారికి హెచ్చ‌రిక‌లు చేసి, వారిని పార్టీ నుంచి పంపేయాల్పసింది పోయి వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెడుతూ ప్రోత్స‌హించారు. దీంతో ఐదేళ్ల పాటు వైసీపీ సోష‌ల్ మీడియా ద్వారా ఆ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రులు చేసిన అరాచ‌కం అంతా ఇంతా కాదు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన‌, టీడీపీ నేత‌లు, వారి కుటుంబ స‌భ్యుల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టిన‌, ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి పోస్టులు చేసిన వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌పై కేసులు పెట్ట‌డం మొద‌లు పెట్టింది. ఒక్కొక్క‌రికి నోటీసులు ఇస్తూ పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక‌ మంది గ‌తంలో వారు చేసిన తప్పుల‌ను ఒప్పుకుంటూ క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నారు. 

ఐదేళ్లు అస‌భ్య‌క‌ర పోస్టుల‌తో చెల‌రేగిపోయిన వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌కు ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వ  చ‌ర్య‌ల‌తో వ‌ణుకు పుడుతోంది. ఇప్ప‌టికే ప‌లువురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో   వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి కూడా ఉన్నాడు. వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి విచారించగా సంచ‌ల‌న విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ఆర్గ‌నైజ్డ్ గా నేర‌పూరిత సామ్రాజ్యాన్ని వీళ్లు నెల‌కొల్పారు. ముఖ్యంగా వైఎస్ ష‌ర్మిళ‌, వైఎస్ విజ‌య‌మ్మ‌, వైఎస్ సునీత‌ల‌పై అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్ట‌డం వెనుక ఎంపీ అవినాశ్ రెడ్డి ప్ర‌మేయం ఉంద‌ని వ‌ర్రా ర‌వీంద‌ర్ రెడ్డి పోలీసుల విచార‌ణ‌లో చెప్పారు. తాడేప‌ల్లిలోని వైసీపీ సోష‌ల్ మీడియా కార్యాల‌యం నుంచి సోష‌ల్ మీడియా ఇంచార్జి స‌జ్జ‌ల భార్గ‌వ్ సూచ‌న‌ల మేర‌కు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌తోపాటు వారి కుటుంబ స‌భ్యుల‌పైనా అస‌భ్య‌క‌ర రీతిలో పోస్టులు పెట్ట‌డం జ‌రిగింద‌ని, అంతా స‌జ్జ‌ల భార్గ‌వ్ క‌నుస‌న్న‌ల్లోనే వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ న‌డుచుకుంద‌ని వ‌ర్రా పోలీసుల విచార‌ణ‌లో పేర్కొన్న‌ట్లు తెలిసింది. అయితే, అప్ప‌టికే  సజ్జల భార్గ‌వ్ తోపాటు ఎంపీ అవినాశ్‌ పీఏపైనా పోలీసులు కేసు న‌మోదు చేశారు. వీరు ప‌రారీలో ఉండ‌టంతో వారికోసం వెతుకుతున్నారు. మ‌రోవైపు శ్రీ‌రెడ్డి, రాంగోపాల్ వ‌ర్మ‌, పోసాని కృష్ణ ముర‌ళితో పాటు ప‌లువురిపైనా ఏపీలోని   స్టేష‌న్‌ల‌లో కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టికే పోలీసులు విచార‌ణ‌కు రావాల‌ని వారికి నోటీసులు ఇచ్చారు. వ‌రుస‌గా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ వ‌ణికిపోతున్నది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్మి ఇదంతా చేశామ‌ని, ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామ‌ని వాపోతున్నారు. 

 

వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌పై వ‌రుస కేసులు న‌మోద‌వుతుండ‌టంతో  సీనియర్ జర్నలిస్టు పి. విజయబాబు హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల  కేసులకు వ్యతిరేకంగా పిల్ వేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసభ్య  పోస్టులు పెట్టినవారిపై పోలీసులు కేసులు పెడితే తప్పేముందని న్యాయస్థానం ప్రశ్నించింది. ఒక దశలో న్యాయమూర్తులను కూడా అవమానపరిచేలా  పోస్టులు పెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పోలీసుల చర్యలను నిలువరిస్తూ ఎలాంటి బ్లాంకెట్ ఉత్తర్వులు ఇవ్వలేమని కుండబద్దలు కొట్టింది. పోలీసులు పెట్టిన కేసులపై అభ్యంతరం ఉంటే సంబంధిత వ్యక్తులు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చని వెల్లడించింది. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చట్టం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తుంటే తాము ఎలా నిలువరించగలమని కోర్టు వ్యాఖ్యలు చేసింది.

కోర్టు తీర్పుతో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ కి గట్టి  ఎదురు దెబ్బ‌త‌గిలిన‌ట్ల‌యింది. అయితే, చాలా మంది ఒక‌వేళ కేసులు న‌మోదై జైలుకెళ్లినా వెంట‌నే బెయిల్ పై బ‌య‌ట‌కు రావొచ్చ‌న్న ఉద్దేశంతో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కానీ, అలాంటి వాటికి తావులేకుండా పోలీసులు కఠిన చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఒక్క‌సారి శిక్ష‌ ప‌డితే సుమారు ఐదేళ్లు జైలు శిక్ష పడటం ఖాయమని న్యాయనిపుణులు అంటున్నారు. బెయిల్ కూడా దొరికే ప‌రిస్థితి ఉండ‌దని చెబుతున్నారు. దీంతో   వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్‌ భ‌యంతో వ‌ణికిపోతున్నది. జగన్ మెప్పుకోసం అనవసరంగా రెచ్చిపోయి ఇక్కట్ల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ స్థానంలో ఈ సంవత్సరం జులై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్‌) లోని సెక్షన్‌-111 ప్రకారం ఇలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు ఉన్నాయి. అసభ్య పోస్టులతో తాము ఎంతలా పేట్రేగిపోయినా పోలీసులు, చట్టాలు ఏమీ చేయలేవని, మహా అయితే అరెస్టు చేసి నోటీసులు ఇచ్చి వదిలేస్తారని, అంతకు మించి ఏమీ కాదంటూ రోజురోజుకు రెచ్చిపోతున్న వారికి ఈ చట్ట ప్రకారమే ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు. ఈ సెక్ష‌న్ ప్ర‌కారం నేరం రుజువైతే ఐదేళ్లు జైలుకెళ్లే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ పై పోలీసులు ఈ సెక్ష‌న్ ప్ర‌కారం కేసు న‌మోదు చేస్తుండ‌టంతో వైసీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. వీడియోలు పెడుతూ త‌మ‌ను క్ష‌మించాల‌ని కూట‌మి ప్ర‌భుత్వాన్ని వేడుకుంటున్నారు. మొత్తానికి కూట‌మి ప్ర‌భుత్వం ఇస్తున్న షాక్‌ల‌తో వైసీపీ సోష‌ల్ మీడియా బ్యాచ్ గ‌జ‌గ‌జ వ‌ణికిపోతుంది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని న‌మ్ముకొని నిండా మునిగిపోయామ‌ని త‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు.