రాజీనామాల ఆమోదం కోసం శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీల ప్లకార్డులు | ycp mlcs show placards demanding to accept their resignations| legislative| council| chairman
posted on Nov 15, 2024 9:09AM
తమ రాజీనామాలు ఆమోదించాల్సిందేనంటూ ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు శాశనమండలిలో ప్లకార్డులు ప్రదర్శించారు. చైర్మన్ గారూ స్పీకర్ ఫార్మట్ లో ఇచ్చిన మా రాజీనామాలను ఎందుకు ఆమోదించడం లేదంటూ ఎన్నిసార్లు కోరినా సమాధానం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలనలో ఉన్నాయని చెప్పి చైర్మన్ తప్పించుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు.
స్పీకర్ ఫార్మట్ లో చేసిన తమ రాజీనామాలు ఆమోదించకుండా, ఇందుకూరి రఘురామ రాజుపై అనర్హత వేటు వేశారని వారు పేర్కొన్నారు. అయితే ఆ అనర్హత వేటును హైకోర్టు తప్పుపట్టిందని వారు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే రాజీనామాలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి మండలిలో తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ ప్లకార్డులు ప్రదర్శించారు.
రాజీనామాలు చేసి నెలలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీ వదిలేశామని వారు బాహాటంగా ప్రకటిస్తున్నా.. వైసీపీ మాత్రం కాదు కాదు మీరు పార్టీలోనే ఉన్నారు, ఉండాలంటూ కాళ్లా వేళ్లా పడుతోంది. వీరి ముగ్గురి రాజీనామాలూ ఆమోదిస్తే.. మరింత మంది అదే దారిలో వెడతారనీ, అప్పుడు మండలిలో ఉన్న మెజారిటీ కూడా హుష్ కాకీ అయిపోతుందనీ వైసీపీ అగ్రనాయకత్వం భయపడుతోంది. వారు సభలోనే రాజీనామాల ఆమోదం కోసం పట్టుపడుతున్నా చైర్మన్ హోషేన్ రాజు మాత్రం నిర్ణయం తీసుకోవడం లేదు. వీరి రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. అయితే ఆ ఉప ఎన్నికలో వైసీపీ గెలిచే అవకాశాలు ఇసుమంతైనా లేవు. వీరి దారిలో మరింత మంది ఎమ్మెల్సీలు రాజీనామాలు చేస్తే మండలిలో ఉన్న ఆ కాస్త బలం కూడా పోతుందన్నది వైసీపీ భయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.