Leading News Portal in Telugu

ఎపిలో పోసానిపై ఫిర్యాదుల వెల్లువ, శ్రీరెడ్డిపై కేసు నమోదు | Flood of complaints against Posani in AP


posted on Nov 15, 2024 10:41AM

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మంత్రి  నారా లోకేష్ లపై గత ప్రభుత్వంలో  అనుచిత వ్యాఖ్యలు  చేసిన రచయిత, వైకాపా నేత పోసాని కృష్ణ మురళిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ ఆంధ్రప్రదేశ్ లో బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్లలో కంప్లయింట్స్ నమోదవుతున్నాయి. టిడిపి, జనసేన శ్రేణులతో బాటు ఒక టీవీ చానల్ విలేకరులు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.  విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోసానిపై ఇప్పటికే కేసు నమోదైన సంగతి తెలిసిందే.  టిడిపి, జనసేన నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్న శ్రీరెడ్డి పై కూడా ఫిర్యాదులు అందుతున్నాయి.  కృష్ణా జిల్లా గుడి వాడ వన్ టౌన్ పోలీసులు ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. హోం మంత్రి వంగల పూడి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమె ప్రతిష్టకు భంగం కలిగే విధంగా వ్యవహరించినందుకు ఈ కేసు నమోదైంది. 

ఈ నెల 12న   టీవీ లైవ్ లో  పోసాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని,  ఇవి అవాస్తవాలని  తెలుగు  రైతు మీడియా   రాష్ట్ర సమన్వయకర్త  గింజుపల్లి వెంకటేశ్వరరావు పత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  ప్రకాశం జిల్లా కనిగిరి,  శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కందుకూరు,  కావలి, పల్నాడు జిల్లా,  క్రోసూరు,  మాచర్ల గ్రామీణం,  వినుకొండ, నత్తెనపల్లి,  నరసారావు పేట పట్టణం, అనకాపల్లి జిల్లా మునగపాక,నర్సీపట్నం,  వైఎస్ ఆర్ జిల్లా మైదుకూరు పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదులు అందాయి