ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ఇక ముగిసిన అధ్యాయమే.. కారణం జగన్ నిర్వాకమే! | volunteer system in ap a closed chapter| minister| dola| bala| veeranjaneyuli| legislative
posted on Nov 20, 2024 2:03PM
కత్తి వాడటం మొదలు పెడితే, నా కన్నా బాగా ఎవడూ వాడలేడు అంటూ మిర్చి సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. దానికి కొంచం మార్చి మనుషులను వ్యవస్థలను వాడుకోవడంలో తనను మించిన వాడు ఎవడూ ఉండడు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు ఉంటుంది. జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలనూ తనకు అనుకూలంగా ఇష్టారీతిగా వాడేసుకున్నారు. ఆ వాడకంలో ఆయన తన కోసం తన చేత తానే సృష్టించిన వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది. వాడకం పూర్తయిన తరువాత జగన్ అంత కాలం తన కోసమే పని చేసిన మనుషులను, వ్యవస్థలను కూడా కూరలో కరివేపాకులా విసిరి అవతల పారేశారు. అలా పారేశిన వాటిలో వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంది.
అందుకే ఇప్పుడు రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉనికి కూడా లేకుండా పోయింది. ఆయన కోసం అన్నీ వదులుకుని నామమాత్రపు వేతనాల కోసం వాలంటీర్లుగా చేరిన లక్షలాది మంది యువత భవిష్యత్ అగమ్యగోచరంగా మారిపోయింది. ఔను ఇదే విషయాన్ని శాసనమండలి వేదికగా మంత్రి డోలా బాలవీరాంజనేయులు చెప్పారు. జగన్ నిర్వాకం వల్ల రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థ అన్నదే లేకుండా పోయిందని ఆయన కుండబద్దలు కొట్టేశారు. గత ఏడాది ఆగస్టు నుంచే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ ఉనికి మాయమైపోయిందని శాసన మండలి జీరో అవర్ లో మంత్రి డోలా బాల వీరాంజనేయ శర్మ చెప్పారు. జగన్ గత ఏడాది ఆగస్టులో వాలంటీర్ల వ్యవస్థను పునరుద్ధరించాల్సి ఉందనీ, కానీ ఆయనా పని చేయకపోవడంతో ఆ నాటి నుంచి ఆ వ్యవస్థ రాష్ట్రంలో లేకుండా పోయిందనీ అన్నారు. జగన్ నిర్వాకం వల్ల గత ఏడాది ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థకు కాలం చెల్లిందని వివరించారు.
వాలంటీర్లను కొనసాగిస్తామంటూ తాము ఎన్నికలలో ఇచ్చిన హామీని అమలు చేద్దామన్నా చేయలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వాలంటీర్లను కొనసాగించి వారికి వేతనాలు ఇద్దామని తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించిందని చెప్పిన మంత్రి డోలా కొలువులో లేని ఉద్యోగికి ప్రభుత్వం నుంచి వేతనం ఇవ్వడానికి ఎలా సాధ్యమౌతుందని సభా ముఖంగా ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్లనే వాలంటీర్లను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొనసాగించడానికి అవకాశం లేకుండా పోయిం దని స్పష్టం చేశారు. వాలంటీర్ల వ్యవస్థను జగన్ సర్కార్ పునరుద్ధరించి ఉన్నట్లైతే తమ సర్కార్ ఇప్పుడు దానిని తప్పని సరిగా కొనసాగించేదని డోలా బాల వీరాంజనేయులు సభా ముఖంగా చెప్పారు.
జగన్ హయాంలో రాష్ట్రంలో 2,63,000 మంది వాలంటీర్లు ఉండేవారనీ, వారిలో లక్షా ఏడు వేల మంది సరిగ్గా ఎన్నికలకు ముందు రాజీనామాలు చేసి వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని తెలిపిన మంత్రి ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా పది వేల మంది వాలంటీర్లు మాత్రమే ఉన్నారని వివరించారు. రాజీనామాలు చేసిన వాలంటీర్లు ఇప్పుడు వైసీపీ నేతల ఒత్తిడి కారణంగానే తాము అప్పట్లో రాజీనామాలు చేశామని చెబుతున్నారు. తమ రాజీనామాలను ఉపసంహరించుకున్నట్లుగా భావించి తిరిగి కొలువులోకి తీసుకోవాలని కోరుతున్నారు. అయితే వాలంటీర్ల పట్ల ప్రజలలో ఏ మాత్రం మంచి అభిప్రాయం లేదు. వారు వైసీపీ ఏజెంట్లని ప్రజలందరికీ తెలుసు. అందుకే వారిని కొనసాగించాలన్న వాదనలో ఇసుమంతైనా పస లేదు. అయినా వాలంటీర్ల ప్రాథమిక బాధ్యత సామాజిక పింఛన్ల పంపిణీ, అది ఈ ఐదు నెలలుగా వారు లేకుండా కూడా సజావుగా సాగుతోంది. అటువంటప్పుడు ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా వాలంటీర్లను కొనసాగించడంలో అర్ధం ఉండదని డోలా బాల వీరాంజనేయులు శాసనమండలి జీరో అవర్ లో స్పష్టంగా చెప్పారు.