Leading News Portal in Telugu

జ‌గ‌న్ ఆశ అడియాశే.. వైసీపీ ఆట ముగిసిన‌ట్లే!? | jagan hopes lost| tdp alliane| strong| ycp| game| over| leaders| ready


posted on Nov 21, 2024 8:59AM

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న దిగ్విజ‌యంగా ముందుకు సాగుతోంది. సీఎం చంద్ర‌బాబు నాయుడు సార‌థ్యంలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. గ‌త ఐదేళ్లు క‌నీస స‌దుపాయాలులేక ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన ఐదు నెల‌ల్లోనే రోడ్ల మ‌ర‌మ్మ‌తుల ద‌గ్గ‌ర నుంచి ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌పై దృష్టిసారించ‌డంతో ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయి. ఏపీలో పెట్టుబ‌డుల ప్ర‌వాహం మొద‌లైంది. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన పై దృష్టి సారించిన ప్రభుత్వం.. ఏకంగా రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపిబి నిర్ణయాలకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇదిలా ఉంటే..  రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారం కోల్పోయిన నాటి నుంచి  అనేక మంది వైసీపీ నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలలో చేరారు. మ‌రికొంద‌రు ఆ దారిలోనే నడిచేందుకు రెడీగా ఉన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే అయిన జ‌గ‌న్ మాత్రం జ‌మిలి ఎన్నిక‌లు వ‌స్తాయి.. మళ్లీ అధికారంలోకి వ‌స్తామ‌ని ప‌దేప‌దే చెబుతూ ముఖ్య‌నేత‌లు పార్టీ వీడ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. మ‌రోవైపు కూట‌మి ప్ర‌భుత్వంలోని పార్టీల నేత‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తేలా వైసీపీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తున్నది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూటమి ఐక్యత విచ్ఛిన్నం అవుతుందనీ, మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహిస్తాననీ  వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌ల‌లు కంటున్నారు. తాజాగా అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో జ‌గ‌న్ ఆశ‌లు అడియాశల‌యిన‌ట్లేన‌ని వైసీపీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతుంది.

ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిస‌హా వైసీపీకి చెందిన ప‌ద‌కొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బాయ్ కాట్ చేశారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్ర‌మే అసెంబ్లీకి హాజ‌ర‌వుతున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. స‌మ‌స్య ప‌రిష్కారానికి మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. దీంతో గ‌త ఐదేళ్ల కాలంలో ఎప్పుడూ లేని విధంగా అసెంబ్లీలో ప్ర‌శాంత‌వాతావ‌ర‌ణంలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అర్ధ‌వంత‌మైన చ‌ర్చ జ‌రుగుతుlన్నది.

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం హ‌యాంలో అసెంబ్లీ స‌మావేశాల్లో మంత్రులు, కొంద‌రు వైసీపీ స‌భ్యులు అస‌భ్య‌ ప‌ద‌జాలంతో అప్పటి ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల‌పై తీవ్ర‌ స్థాయిలో విరుచుకుప‌డ్డారు. దీంతో ఏపీలో అసెంబ్లీ స‌మావేశాలు అంటేనే ప్ర‌జ‌లు టీవీలు బంద్‌పెట్టే ప‌రిస్థితి ఏర్ప‌డింది. కానీ, చంద్ర‌బాబు సార‌థ్యంలోని తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వంలో అసెంబ్లీ స‌మావేశాలు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్నాయి. తాజాగా.. బుధ‌వారం (నవంబర్ 20)   అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలో అద్భుత‌మైన పాల‌న సాగుతున్నద‌ని అన్నారు.  ఐదు సంవ‌త్స‌రాలే కాదు.. ద‌శాబ్ద‌కాలం పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్ర‌బాబు నాయుడే ఉంటార‌ని, కూట‌మి ప్ర‌భుత్వం దిగ్విజ‌యంగా ముందుకు సాగుతుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌తో వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, ఆ పార్టీ నేత‌ల ఆశ‌లు అడియాశ‌లైన‌ట్లేన‌ని చెప్పొచ్చు. 

అసెంబ్లీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌తో వైసీపీ నుంచి తెలుగుదేశం కూట‌మి పార్టీల్లోకి  వ‌ల‌స‌లు పెర‌గ‌డం ఖాయ‌మ‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌ జ‌రుగుతుంది. ఇప్ప‌టికే వైసీపీ హ‌యాంలో బూతుల‌తో సోష‌ల్ మీడియాలో రెచ్చిపోయిన వారిపై ప్ర‌భుత్వం కొర‌డా ఝుళిపిస్తోంది. సహజంగా వీరిలో వైసీపీకి చెందిన నేత‌లే ఎక్కువ‌గా ఉన్నారు. దీనికి తోడు వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌కు పాల్ప‌డిన వారిపైనా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఈ కేసుల నుంచి త‌ప్పించుకునేందుకు ప‌లువురు వైసీపీ నేత‌లు కూట‌మిపార్టీల్లోకి చేరేందుకు స‌న్న‌ద్ద‌మ‌వుతున్నారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం.. జ‌మిలి ఎన్నిక‌లు రాబోయేతున్నాయి.. మ‌ళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుంద‌ని పదేప‌దే చెబుతుండ‌టంతో కూట‌మి పార్టీల్లో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న నేత‌లు కాస్త వెనుక‌డుగు వేస్తున్న ప‌రిస్థితి. దీనికితోడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను సైతం బెదిరింపుల‌కు గురిచేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేది వైసీపీ ప్ర‌భుత్వ‌మేన‌ని.. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను ఇబ్బందులు పెట్టిన అధికారుల‌ను గుర్తుపెట్టుకొని మేము అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఇటీవ‌ల‌ హెచ్చ‌రించారు. అంతే కాదు.. ఇప్పుడు వైసీపీ నేత‌ల‌ను ఇబ్బందులు పెట్టి.. త‌రువాత‌ ప‌ద‌వీ విర‌మ‌ణ పొంది విదేశాల‌కు పోయిన‌వారినిసైతం ప‌ట్టుకొచ్చి  జైలుకు పంపిస్తామంటూ హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. దీంతో కొంద‌రు అధికారులు వైసీపీ నేత‌ల జోలికి వెళ్లాలంటే భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్య‌ల‌తో.. వైసీపీ నుంచి కూట‌మి పార్టీల్లోకి చేరే నేత‌ల‌ సంఖ్య పెర‌గ‌నుండ‌టంతో పాటు.. అధికారుల్లో దైర్యాన్ని నింపిన‌ట్ల‌యింది.