పేరుకు బీసీ జపం.. పదవుల వేటే అసలు మంత్రం! | bjp rajyasabha candidate rkrishnayya| name bc welfare| copmete| with| Chameleon|change
posted on Dec 3, 2024 3:44PM
భక్తి దేవుడిపై కాదు.. ప్రసాదం మీద అన్నట్లుగా ఆర్. కృష్ణయ్య తీరు ఉంటుంది. బీసీలకు తానే నాయకుడినని చెప్పుకుంటూ ఆ పేరుతో అధికారంలో ఉన్న పార్టీల పంచన చేరి బడా పదవులు కట్టేస్తుంటారు. స్వల్ప వ్యవధిలోనే దాదాపు అన్ని పార్టీలనూ చుట్టేశారు. ఏ పార్టీలోకి వెళ్లినా బడా పదవులు దక్కించుకోవటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. పార్టీల అధిష్టానాలు సైతం ఆయనకు పదవి ఇస్తే బీసీల సమస్యలను పరిష్కరించినట్లేనని భావిస్తాయి. కానీ, ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మెజార్టీ బీసీలు దూరమైనట్లే. ఈ విషయం అనేక సార్లు రుజువైంది. కానీ, ఆయన మాత్రం బీసీలంతా తన వెంటే.. తన వైపే అంటూ ఇప్పటికీ రాజకీయ పార్టీలను నమ్మించి పెద్ద పెద్ద పదవులను తన ఖాతాలో వేయించేసుకుంటారు. తాజాగా మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.. ఈ సారి మరో కొత్త పార్టీ నుంచి. ఇంతకీ ఆయన ఎవరని తెగ ఆలోచిస్తున్నారా.. అంత అవసరం లేదు.. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరు అన్ని వర్గాల ప్రజలకు సుపరిచితమే. ఆయనే రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ . కృష్ణయ్య. మొన్నటి వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగిన కృష్ణయ్య. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతం బీజేపీ కండువా కప్పుకొని ఆ పార్టీ నుంచి మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు రెడీ అయిపోయారు. అయితే బీసీ నాయకుడి హోదాలో ఆర్. కృష్ణయ్య బడా పదవులు దక్కించుకుంటున్నప్పటికీ.. బీసీ వర్గాలకు, ఆయనకు పదవి ఇచ్చి గౌరవించిన పార్టీలకు ఇసుమంతైనా మేలు చేకూర్చలేక పోతున్నారు సరికదా, పదవులిచ్చిన పార్టీలకు ఆయన వల్ల తేరుకోలేని నష్టం వాటిల్లుతోంది. ఆర్.కృష్ణయ్యకు పెద్ద పీట వేసిన వెంటనే ఆయా పార్టీలకు బీసీలు దూరం అవుతున్నారు. పాలిటిక్స్ లో ఇదో సెంటిమెంటుగా ధృవపడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఆర్.కృష్ణయ్య ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మెజార్టీ బీసీలు హ్యాడిచ్చేస్తారన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది.
ఏపీలో మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు మంగళవారం (డిసెంబర్ 3(నోటిఫికేషన్ విడుదలైంది. 10వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉంటుంది. వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీల రాజీనామాలతో ఈ ఎన్నికలు అనివార్యమయ్యాయి. రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీల్లో మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌రావు తెలుగుదేశంలో చేరారు. ఆర్.కృష్ణయ్య మాత్రం తాను ఏ పార్టీలోనూ చేరను, సొంత పార్టీ పెడతా అంటూ బీరాలు పలికినా.. బీజేపీ పెద్దలతో మాత్రం టచ్‌లో ఉన్నారు. ఆర్.కృష్ణయ్య రాజ్యసభ సభ్యుడిగా ఉండగానే రాజీనామా చేశారు. అదీ ఎన్నికలలో తాను ఏ పార్టీ తరఫునైతే ప్రాతినిథ్యం వహిస్తున్నారో ఆ వైసీపీ ఘోరంగా ఓడిపోయిన తరువాత రాజీనామా చేశారు. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బీజేపీ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టిన బీసీ నేతగా పేరున్న ఆర్. కృష్ణయ్య బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు. ఎందుకంటే ఆ పార్టీ నుంచి మరోసారి ఆయన రాజ్యసభకు వెళ్లేందుకు రూట్ క్లియర్ అయ్యింది కాబట్టి. ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే వారిలో ఇద్దరు తెలుగుదేశం నుంచి నుంచి కాగా.. మరొకరు కూటమి కోటాలో బీజేపీ నుంచి వెళ్లనున్నారు. బీజేపీ నుంచి వెళ్లే రాజ్యసభ సభ్యుడిగా ఆర్. కృష్ణయ్య పేరు ఖాయమైందని తెలుస్తోంది. ఆర్ కృష్ణయ్యకు పార్టీ తరపున రాజ్యసభకు పంపించడం ద్వారా తెలంగాణలోని బీసీలంతా బీజేపీవైపు వస్తారని కమలనాథుల అంచనా వేస్తున్నారు. అయితే, గతంలో ఆర్ కృష్ణయ్యకు పెద్దపీట వేసిన పార్టీలు కూడా ఇలానే ఆలోచించి చేతులు కాల్చుకున్నాయి. ప్రస్తుతం బీజేపీ ఆ జాబితాలో చేరేందుకు సిద్ధమైంది.
2014 లో రాష్ట్ర విభజనకు ముందు వరకూ ఆర్.కృష్ణయ్య బీసీ సంఘం నేతగా కొనసాగారు. రాష్ట్ర విభజన తరువాత అనూహ్యంగా తెలంగాణ తెలుగుదేశంలో చేరారు. ఆ ఎన్నికల్లో ఎల్బీనగర్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. 2018లో తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన కృష్ణయ్య కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత కొద్ది కాలానికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2 019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి రావడంతో ఆయన జగన్ తో సన్నిహిత సంబంధాలు ఏర్పర్చుకున్నారు. వైసీపీ తరపున రాజ్యసభకు ఎన్నికయ్యారు. వైసీపీ అధికారానికి దూరం కాగానే ఆ పార్టీకి, పదవికి ఆర్. కృష్ణయ్య రాజీనామా చేశారు. ప్రస్తుతం బీజేపీలో చేరి మరోసారి రాజ్యసభకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే.. ఆర్. కృష్ణయ్య ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి రాదన్న వాదన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంటుంది. దీనికి కారణం లేకపోయలేదు. ఆయా పార్టీలు ఆర్. కృష్ణయ్య మన పార్టీలో ఉంటే బీసీలంతా మనవైపు ఉంటారన్న భ్రమల్లో ఉంటారు. కానీ, ఫలితం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంటూ వస్తోంది. ఊసరవిల్లి రంగులు మార్చడం కంటే వేగంగా కృష్ణయ్య పార్టీలు మార్చేస్తుండటం కూడా సహజంగానే బీసీలలో ఆయన పట్ల విశ్వాసం సన్నగిల్లేలా చేస్తున్నది. అందుకే ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీకీ బీసీలు దూరం అవుతున్నారన్న వాదన కూడా ఉంది.
ఆ వాదన ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగావేయాలని భావిస్తున్న బీజేపీకి.. ఆర్ కృష్ణయ్య చేరిక ఎదురుదెబ్బే అవుతుందన్న భావన రాజకీయ వర్గాలలో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రమంలో ఆర్. కృష్ణయ్య బీజేపీలో చేరడాన్ని ఆ పార్టీలోని పలువురు వ్యతిరేకిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ పార్టీ కండువా కప్పినా కీలక పదవులు అప్పగించొద్దని పలువురు బీజేపీ నేతలు ఇప్పటికే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే, బీజేపీ అధిష్టానం మాత్రం ఆయనకు రాజ్యసభ ఇచ్చి గౌరవించేందుకు సిద్ధమైపోయింది. అయితే, ఆర్. కృష్ణయ్య ఈసారైనా రాజ్యసభ హోదాలో బీసీ వర్గాల సమస్యలను పరిష్కరించడంతోపాటు.. బీజేపీ అధికారంలోకి వచ్చేలా ఏమేరకు కృషి చేస్తారో వేచి చూడాల్సిందే.