Leading News Portal in Telugu

వైఎస్ వివేకా హత్య కేసు.. జగన్ బంధువులకు నోటీసులు | ysviveka murder case| notices| to| jagan


posted on Dec 4, 2024 4:35PM

జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి పార్టీ చిత్తుచిత్తుగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దీంతో అప్పటి వరకూ నత్తనడకన నడిచిన వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఈ కేసుకు సంబంధించి కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తాజాగా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి బంధువులు సహా పలువురికి నోటీసులు జారీ చేశారు. అలా నోటీసులు అందుకున్న వారిలో జగన్ రెడ్డి బావమరిది ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి, కడప ఎంపీ వైస్ అవినాష్ రెడ్డి మావ మనోహర్ రెడ్డి, సోదరుడు అభిషేక్ రెడ్డి ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ ట్రస్ట్ సభ్యుడు జనార్దన్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డి ఉన్నారు. వీరు కాకుండా మరో ఐదుగురు సాక్షులకు నోటీసులు అందాయి. ఈ పది మందినీ కూడా గురువారం (డిసెంబర్ 5) విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొన్నారు.  

అయితే ఈ నోటీసులు వివేకా హత్య కేస దర్యాప్తులో భాగంగా కాకుండా వివేకానందరెడ్డి మాజీ పీఎ  కృష్ణారెడ్డి గత ఏడాది డిసెంబర్ 15న చేసిన ఫిర్యాదు మేరకు జారీ చేశారు. వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డి వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి అలాగే సీబీఐ అధికారి రామ్ సింగ్ లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.   ఈ ఫిర్యాదుపై పది రోజుల కిందటే కృష్ణారెడ్డిని విచారించిన పోలీసులు తాజాగా జగన్ బంధువులు సహా పది మందికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

వాస్తవానికి వివేకా హత్య కేసు దర్యాప్తునకు సుప్రీం కోర్టు విధించిన గడువు ముగిసిపోయింది. దీంతో సీబీఐ విచారణ ఆపివేసింది. గడువు పెంచాలన్న సీబీఐ వినతిపై సుప్రీం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ కారణంగానే వివేకా హత్య కేసు విషయంలో ఇటు దర్యాప్తు కానీ, అటు కోర్టుల్లో విచారణ కానీ జరగడం లేదు. అయితే ఇప్పుడు పోలీసులు వివేకా హత్య కేసులో తనను వేధిస్తున్నారంటే ఆయన మాజీ పీఏ చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టారు.  దీంతో ఈ దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటికే వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు విచారించారు. ఆ విచారణలో ఆయన వెల్లడించిన అంశాల ఆధారంగానే ఇప్పుడు జగన్ బంధువులు సహా పది మందిని పోలీసులు విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు.