Leading News Portal in Telugu

బుగ్గల మెరుపు.. జింక పరుగు.. ప్రియాంక, అతిశిలపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు | bjp leader inappropriate comments| priyanka| gandhi


posted on Jan 16, 2025 10:04AM

అధికారంతో వచ్చిన అహంకారమో, లేక మహిళల పట్ల నిజంగానే చిన్న చూపో కానీ బీజేపీ నేతలు మహిళల విషయంలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ బీజేపీ నాయకుడు రమేష్ బిధూరి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా వధేరా గాంధీపై చేసిన వ్యాఖ్యల దుమారం చల్లారకముందే..  ఢిల్లీ సీఎం  ఆతీశిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.  వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారం జోరందుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఎన్నికలలో  సప్పోజ్ ఫర్ సప్పోజ్ బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తే ఆ  పార్టీ సీఎం అభ్యర్థి రేసులో ఉన్న బిధూరీ.. తన వ్యాఖ్యలతో పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. ఇటీవల ఆయన ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ బిధూరీ ఢిల్లీలో బీజేపీని గెలిపిస్తే హస్తిన రోడ్లను ప్రియాంక గాంధీ బుగ్గల మాదిరిగా నున్నగా మారుస్తామని అన్నారు.  ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. బీజేపీ డిఫెన్స్ లో పడింది. అయినా ఇసుమంతైనా మారని రమేష్ బిధూరీ తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశిని జింకతో పోల్చి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. 

గత ఐదేళ్లుగా డిల్లీని పట్టించుకోని అతిశి ఎన్నికలు వచ్చే సరికి ఢిల్లీ రోడ్లపై జింకలా పరుగులు పెడుతున్నారంటూ నోరు పారేసుకున్నారు. దీనిపై ఆప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బిధూరీ క్షమాపణకు డిమాండ్ చేయడమే కాకుండా.. ఎన్నికల సంఘానికి, మహిళా కమిషన్ కు సైతం ఫిర్యాదు చేసింది.