Leading News Portal in Telugu

బీజేపీ మెగా ఫ్యామిలీ జ‌పం.. పెద్ద స్కెచ్చే! | bjp megafamily chant a big sketch| power| telangana| aim| 2028| elections


posted on Jan 17, 2025 9:08AM

కేంద్రంలో వ‌రుగా మూడు సార్లు అధికారంలోకి వ‌చ్చిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి ద‌క్షిణాది రాష్ట్రాలు మాత్రం ఝ‌ల‌క్ ఇస్తున్నాయి. త‌మిళ‌నాడు,  కర్నాటక, కేర‌ళల‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి అధికారం అంద‌ని ద్రాక్ష‌గానే మిగిలిపోతోంది.  గ‌త ఎన్నిక‌ల్లో ఏపీలో టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌తో క‌లిసి పోటీచేసిన బీజేపీ త‌న ఉనికిని కాపాడుకోగలిగింది. ఇక తెలంగాణ‌లో ఒంటిరిగానే పోరాటం సాగిస్తున్న ఆ పార్టీకి అధికారం మాత్రం అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. తెలంగగాణలో గ‌త‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో  జ‌నసేన పార్టీతో క‌లిసి పోటీ చేసిన బీజేపీ ఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో  విజయం సాధించగలిగింది. ఇక పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో  బీజేపీ  17 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేసిఎనిమిది నియోజ‌క‌వ‌ర్గాల్లో విజయం సాధించింది. అయితే అధికారం మాత్రం ఆ పార్టీకి అందని ద్రాక్షగానే మిగిలింది. ఎలాగైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అదిష్టానం ఇప్ప‌టి నుంచే పావులు క‌దుపుతోంది. ఎలాగైనా తెలంగాణ‌లో అధికార పగ్గాలు అందుకోవాలన్న పట్టుదలతో ఆ పార్టీ అడుగులు వేస్తోంది. అందివ‌చ్చిన ప్ర‌తీ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ బీజేపీ రోజురోజు బ‌లోపేతం అవుతోంది. అయితే, బీజేపీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేసుకుంటూ వెళ్లినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావాలంటే బ‌ల‌మైన ప్ర‌జా మ‌ద్ద‌తు క‌లిగిన కుటుంబం తోడు పార్టీకి ఉండాల‌ని బీజేపీ అధిష్టానం భావిస్తున్నది.


ఏపీలో తెలుగుదేశం, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అధికారంలో  ఉంది. అయితే, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇదే ఫార్ములాను తెలంగాణ‌లోనూ అప్ల‌య్ చేయాల‌ని బీజేపీ అధిష్టానం తొలుత భావించింది. కానీ, తెలంగాణ‌లో తెలుగు దేశం పార్టీకి బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉంది. ఆ పార్టీని న‌డిపించే నాయ‌కుడు లేక‌పోయినా గ్రామ‌గ్రామాన టీడీపీకి భారీగానే ఓటు బ్యాంక్ ఉంది. ఈ కార‌ణంగా ఆ పార్టీతో క‌లిసి ఎన్నిక‌ల‌కు వెళితే బీజేపీకి పెద్దగా ప్రయోజనం ఉండదనీ, ఏపీలో మాదిరిగా ఉనికి చాటుకోవడానికే తెలుగుదేశంతో పొత్తు తెలంగాణలో ఉపయోగపడుతుందని బీజేపీ పెద్ద‌లు అంచ‌నా వేస్తున్నారు. దీనికితోడు ఏపీలో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌రువాత చంద్ర‌బాబు నాయుడు తెలంగాణ‌లో  తెలుగుదేశం పార్టీ  బ‌లోపేతంపై దృష్టి పెట్టారు. దీంతో వివిధ కారణాలతో తెలుగుదేవం పార్టీని వీడిన తెలంగాణ నేతలలో  చాలా మంది సొంత‌ గూటికి అంటే తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.   ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీచేయాల‌ని అధినేత చంద్ర‌బాబుపై పార్టీ క్యాడ‌ర్ ఒత్తిడి పెరుగుతోంది.  ఇప్పటికే తెలంగాణలో త్వరలో జరగనున్నన పంచయతీ ఎన్ని కలలో సత్తా చాటేందుకు తెలుగుదేశం సమాయత్తమౌతోంది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో బీజేపీ అధిష్టానం క‌నుస‌న్న‌ల్లో న‌డుచుకునే, ప్ర‌జాబ‌లం క‌లిగిన కుటుంబం మ‌ద్ద‌తు పార్టీకి అవ‌స‌ర‌మ‌ని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే మెగా ఫ్యామిలీ అండ‌కోసం బీజేపీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇప్ప‌టికే ఏపీలో ప‌వ‌ర్ స్టార్‌, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీకి అన్నివిధాలుగా అండ‌గా ఉంటున్నారు. బీజేపీ కేంద్ర పార్టీ సైతం ప‌వ‌న్ ను సొంత పార్టీ నేత‌గానే ప‌రిగ‌ణిస్తున్నది. ఇదే క్ర‌మంలో మెగా ఫ్యామిలీకి పెద్ద‌గా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ మ‌నిషిగా ప్ర‌జ‌ల్లో ముద్ర‌ వేసేందుకు ఆ పార్టీ పెద్ద‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఆ మేర‌కు ఇప్ప‌టికే స‌ఫ‌లం అయ్యార‌ని చెప్పొచ్చు.

చిరంజీవికి ఏపీతోపాటు తెలంగాణ‌లోనూ భారీగానే అభిమానులున్నారు. వృద్ధుల నుంచి ప్ర‌స్తుతం యువ‌కుల వ‌ర‌కు మెగా ఫ్యామిలీకి మూడు త‌రాల‌కు చెందిన అభిమానులు ఉన్నారు. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, రాంచ‌ర‌ణ్‌తోపాటు దాదాపు అర‌డ‌జ‌న్ మంది హీరోలుగా కొన‌సాగుతున్నారు. వీరంద‌రికీ ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. ఈ క్ర‌మంలో మెగా ఫ్యామిలీ అండ‌తో వ‌చ్చే ఎన్నిక‌ల‌కు వెళితే అధికార పీఠాన్ని ద‌క్కించుకోవ‌చ్చ‌ని బీజేపీ పెద్ద‌లు బ‌లంగా న‌మ్ముతున్నారు. అయితే, ఈ ప్లాన్ ఇప్ప‌టికిప్పుడు అమ‌లు చేస్తున్న‌ది కాద‌ని పరిశీలకులు అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల ముందు నుంచే మెగా ఫ్యామిలీకి బీజేపీ పెద్ద‌లు ప్రాధాన్య‌త‌నిస్తూనే వ‌స్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఈ వ్యూహాన్ని స‌మ‌ర్ధ‌వంతంగా అమ‌లు చేయ‌లేక‌పోయిన బీజేపీ అధిష్టానం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ప‌క్కాగా అమ‌లు చేసి అనుకున్న ల‌క్ష్యాన్ని సాధించాల‌న్న పట్టుదలతో ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో బీజేపీ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాల్లో మెగాస్టార్ చిరంజీవికి ప్రాధాన్య‌త‌నిస్తూ వ‌చ్చారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు అమిత్ షా, ప్ర‌ధాని న‌రేంద్రమోదీతో ప‌లు ద‌ఫాలుగా చిరంజీవి, ఆయ‌న కుమారుడు రాంచ‌ర‌ణ్ భేటీ అయ్యారు. ముఖ్యంగా ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌మాణస్వీకారోత్స‌వ స‌మ‌యంలో  ప్రధాని మోడీ చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను హ‌త్తుకొని అభినందించినతీరు మెగా కుటుంబం బీజేపీకి మ‌ద్ద‌తు దారు అన్న ముద్రను ప్రజల్లో వేసింది.   దానిని కాపాడుకుని తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలంగా మెగా ఫ్యామిలీ అండ పొందాలని ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.