posted on Jan 17, 2025 10:59AM
ఆరుగాలం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోతే రైతుపడే ఆవేదన మాటల్లో వర్ణించలేం.వాణిజ్య పంటలయితే లక్షల్లో నష్టం వస్తుంది.గత రెండేళ్లుగా మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం ఎదురు చూసి చూసి విసిగి వేశారిపోయారు. పంటలకు కనీసం మద్దతు ధరల కోసం ఉత్తరాది రైతులు సంవత్సరాల తరబడి రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాల నుంచి కనీసం స్పందన లేకపోవడమే కాకుండా ఆందోళన చేస్తున్న రైతులపై అణచివేత చర్యలకు పాల్పడటం నిజంగా అమానుషం. మాటల్లో చెప్పలేనంత దారుణం. 2002,2023 సంవత్సరాలలో మిర్చిధర క్వింటాలుకు రూ.28 వేలు గరిష్టంగా పలికింది. గత ఏడాది జనవరి నుంచి ధరలు పతనమవడం ప్రారంభించాయి. దాంతో కొంతమంది రైతులు కోల్డ్ స్టోరేజ్ తమ పంటను నిల్వ చేశారు. అయితే దీర్ఘకాలం ధర లేకపోవడంతో కోల్డ్ స్టోరేజి అద్దెలు వారి నష్టాలను మరింత పెంచాయి తప్ప ప్రయోజనం లేకుండా పోయింది. మేలు రకాల మిర్చి ధరలు సైతం రూ.10నుంచి 15 వేల వరకూ పడిపోయాయి. మిర్చి రైతుకు 2023లో గిట్టుబాటుగా మార్కెట్ ధర లభించడంతో రైతులు పంట విస్తీర్ణం పెంచారు. కాని ధరల పతనంతో ఎకరానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయల నష్టం వాటిల్లి రైతులు కుదేలయ్యారు.
సగటున ఎకరాకు 10క్వింటాళ్ల మిర్చి పంట దిగుబడి వస్తుంది. ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్ లలో 19 లక్షల క్వింటాళ్ల మిర్చి నిల్వ ఉంది.రాయల సీమలో కొత్త పంట వచ్చింది. కర్ణాటక, తెలంగాణలలో కూడా రోజూ వేలల్లో టిక్కీల మిర్చి వస్తున్నది. దీంతో గ 2014, 2015 నాటి పరిస్థితి పునరావృతమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. .దళారీలు అంతర్జాతీయ మార్కెట్ లేదని బుకాయిస్తున్నారు.
ఈ ఏడాది మిర్చి ధర దారుణంగా పడిపోయింది. మేలు రకాలకు క్వింటాలుకు కేవలం 13వేల నుంచి 15 వేల రూపాయల ధర లభిస్తోంది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వాలు మిర్చి రైతును ఆదుకునే విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి.