కర్నాటక కాంగ్రెస్ లో రచ్చకెక్కిన విభేదాలు | differences in karnataka congress| peak| government| pride
posted on Jan 17, 2025 11:47AM
కర్నాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కడం ప్రభుత్వ ప్రతిష్ఠను సైతం మసకబారుస్తోంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీలో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. అప్పట్లో అధిష్ఠానం జోక్యం చేసుకుని సమస్యను సామరస్యంగా పరిష్కరించింది. సీఎం పదవి కోసం పోటీ పడిన సిద్దరామయ్య, డీకే శివకుమార్ లను సముదాయించి.. సిద్దరామయ్యను ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ను డిప్యూటీ సీఎంగా కలిసి పని చేసుకోవాలని సూచించింది. అప్పట్లో చెరో రెండేళ్లూ సీఎం అన్న ఒక ప్రతిపాదనకు ఇద్దరూ అంగీకరించారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.
ముడా అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ముడా స్థల కేటాయింపుల విషయంలో సీఎం సిద్దరామయ్యపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీఎం సిద్దరామయ్యను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ గౌహ్లోత్ అనుమతి ఇచ్చారు. దీంతో సీఎంగా సిద్దరామయ్య సీఎం పదవి నుంచి తప్పుకుంటారన్న ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతు దారులు రెండున్నరేళ్ల సీఎం ప్రతిపాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ వ్యవహారం అలా సాగుతుం డగానే… తాజాగా మంత్రి సతీష్ జార్కిహోలీ ఓ టెలివిజన్ డిబేట్ లో డీకే శివకుమార్ పై చేసిన వ్యాఖ్యలు పార్టీలో మంటలు రేపాయి. ఆయన కాంగ్రెస్ కర్నాటక అధ్యక్షుడిని మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలో విభేదాలను ఒక్కసారిగా రోడ్డున పడేశాయి. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి ఎక్కువ సమయం కేటాయించే నాయకుడు ఉండాలన్నది సతీష్ జార్కి హోలీ వ్యాఖ్యల సారాంశం. దీనిపై సీరియస్ గా స్పందించిన డీకే శివకుమార్.. పదవి అనేది దుకాణంలో దొరికే వస్తువు కాదంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెండ్ మంజునాథ్ భండారీ సతీష్ జార్కిహోలీ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా అటువంటి వ్యాఖ్యలు మానుకవాలని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.