Leading News Portal in Telugu

దావోస్ పర్యటనలో లోకేష్ కీలక భేటీలు.. మూడు సెషన్లలో ప్రధాన వక్తగా ప్రసంగాలు! | lokesh key role in davoos tour| discussions| roumdtable| conferences| media


posted on Jan 17, 2025 1:46PM

రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్, రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు దావోస్ లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మంత్రులు లోకేష్,   టీజీ భరత్ , ముఖ్యమంత్రి కార్యదర్శి కార్తికేయ మిశ్రా, సిఎం  చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనాథ్ బండారు, ఆర్థిక, పరిశ్రమల శాఖలకు చెందిన సీనియర్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవో సాయికాంత్ వర్మ సిఆర్‌డిఏ  ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మాట్  దావోస్ లో పర్యటించనున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఐదు సెషన్ లలో ప్రధాన వక్తగా పాల్గొనే అవకాశం ఆంధ్రప్రదేశ్ కు దక్కగా వీటిలో మూడు సెషన్ లలో చంద్రబాబు ప్రసంగిస్తారు. మిగిలిన రెండింటిలో మంత్రి నారాలోకేష్ ప్రధాన వక్తగా ప్రసంగిస్తారు. అలాగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50 మంది దౌత్యవేత్తలు, పారిశ్రామిక వేత్తలతో లోకేష్ భేటీ కానున్నారు. ఈ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ విషయంలో చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా కీలక భూమిక పోషిస్తున్నారు.

 ప్రధానంగా ఏపీ పెవిలియన్ లో పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి భేటీలు, చర్చలలో లోకేష్ లీడ్ తీసుకోనున్నారు.  రాష్ట్రంలో పెట్టుబడులకు గల అనుకూలతలు, మెరుగైన పర్యావరణ వ్యవస్థ, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహకాల గురించి వారికి వివరించనున్నారు. అలాగే సీఎన్‌బీసీ, టీవీ 18, బిజినెస్ టుడే, ఎకనమిక్ టైమ్స్, బ్లూమ్ బర్గ్, మనీ కంట్రోల్ వంటి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థల ప్రతినిధులతో ఇంటరాక్టివ్ సెషన్స్ లో నారా లోకేష్ పాల్గొననున్నారు. 

అదే విధంగా  ప్రపంచవ్యాప్తంగా విద్యారంగంలో వస్తున్న మార్పులపై  విద్యారంగ గవర్నర్ల సమావేశంలో కూడా లోకేష్ పాల్గొంటారు.   మెరుగైన పర్యావరణ వ్యవస్థ నిర్మాణం,  ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రభావం వంటి అంశాలపై   ప్రముఖులతో నిర్వహించే సమావేశాలలో పాలుపంచుకుంటారు.  నెక్ట్స్ జెన్ ఏఐ, డాటా ఫ్యాక్టరీ, ఏఐ విశ్వవిద్యాలయం ఏర్పాటు అంశాలపై ఎన్ విడియా ప్రతినిధులు, ఏఐ ఫర్ గుడ్ గవర్నెన్స్ పై గూగుల్ సంస్థ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు.