Leading News Portal in Telugu

అయోధ్య బాలరాముడికి పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ చైర్మన్ | ttd chairman offer pattu vastralu to ayodhya balarama| brnaidu| sarayu| river


posted on Jan 20, 2025 6:10AM

అయోధ్య బాలరామాలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ సందర్భంగా బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఆయన అయోధ్య రాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇలా అయోధ్యరాముడికి టీటీడీ తరఫున పట్టు వస్త్రాల సమర్పణ చరిత్రలో ఇదే ప్రథమం. అయోధ్యలో పర్యటించిన టీటీడీ చైర్మన్ శనివారం (జనవరి 18) రాత్రి  అయోధ్యలో సరయూ నది ఒడ్డున జరిగే హారతి కార్యక్రమంలో సతీసమేతంగా పాల్గొన్నారు.

ఆదివారం (జనవరి 19)న తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున అయోధ్య బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  అంతకు ముందు అయోధ్య ఆలయం వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడికి జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ స్వాగతం పలికారు.  మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా వెళ్ళి బీఆర్ నాయుడు అయోధ్య బాలరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం అర్చకులు టీటీడీ బృందానికి ఆశీర్వాదం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు  భాను ప్రకాష్ రెడ్డి, హెచ్ డీపీపీ కార్యదర్శి   రామ్ రఘునాథ్, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులు, ముఖ్య అర్చకుడు  గోపీనాథ్ దీక్షితులు, బొక్కసం ఇన్ ఛార్జ్ గురురాజ స్వామి తదితరులు పాల్గొన్నారు.