చంద్రబాబు హెరిటేజ్ ఎందుకు ప్రారంభించారో తెలుసా? | reason behind cbn start heritage| values| politics| family| avoid| financial
posted on Jan 21, 2025 10:07AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాజకీయాలలో విలువలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి. రాజకీయాల ద్వారా ఆస్తుల సంపాదన వల్ల చెడ్డ పేరు వస్తుందని మనసావాచా కర్మణా నమ్ముతారు. తాను రాజకీయాలలో ఉన్నందున కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులనూ ఎదుర్కోకూడదన్న భావనతో ఆయన వ్యాపారం ప్రారంభించాలని భావించారు. ప్రారంభంలో ఒకటి రెండు వ్యాపారాలు చేసినా అవి విఫలమయ్యాయి.
చివరకు హెరిటేజ్ ను స్థాపించారు. అది సక్సెస్ అయ్యింది. చంద్రబాబు ఎన్నడూ హెరిటేజ్ వ్యవహారాలలో జోక్యం చేసుకోలేదు. ఆయన సతీమణి భువనేశ్వరే హెరిటేజ్ వ్యవహారాలన్నీ చూసుకుంటారు. రాజకీయాలలోకి రాక ముందు నారా లోకేష్ హెరిటేజ్ బాధ్యతలు నిర్వహించారు. ఆయన కూడా రాజకీయాలలోకి వచ్చిన తరువాత ఆ బాధ్యతలను ఆయన సతీమణి బ్రహ్మణి చూసుకుంటున్నారు. దీని వల్ల ఇటు తన రాజకీయాలకూ, అటు కుటుంబానికీ ఎటువంటి ఇబ్బందులూ రావడం లేదని అన్నారు. హెరిటేజ్ వల్లనే తమ కుటుంబం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా ఉందన్నారు. దావోస్ వేదికగా చంద్రబాబు ఈ విషయాలను వెల్లడించారు.
అంతే కాదు.. తెలుగుదేశం పార్టీ కూడా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులకూ గురి కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో పార్టీ తరఫున కూడా ఒక కంపెనీ ప్రారంభించాలని భావించాననీ, ఆ కంపెనీ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాజకీయాలకు ఖర్చు పెట్టాలని అనుకున్నాననీ తెలిపారు. అయితే అందుకు చట్టాలు అంగీకరించకపోవడంతో ఆ పని చేయలేదని చంద్రబాబు చెప్పారు. దావోస్ పర్యటనలో భాగంగా మీట్ అండ్ గ్రీట్ విత్ డయాస్పోరా పేరుతో తెలుగు పారిశ్రమిక వేత్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి దాదాపు 12 దేశాల నుంచి తెలుగు ఇండస్ట్రియలిస్టులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశించి తానా నాడు ఇంజినీరింగ్ కళాశాలు పెట్టాలని తీసుకున్న నిర్ణయం వల్లే మీరీనాడు ఇక్కడ ఉన్నారని చెప్పారు.