Leading News Portal in Telugu

అతి విధేయతా.. అభద్రతతో అనవసర రచ్చ | over obedience and insecurity reason for unnecessary contravarsy| janasena| tdp| cader


posted on Jan 21, 2025 1:43PM

తెలుగుదేశం కూటమి పార్టీల కార్యకర్తల మధ్య ఇప్పుడు ఓ అనవసర రచ్చ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు ఎందుకో తెలియదు కానీ ఓ విధమైన అభద్రతా భావంలో ఉన్నారా అనిపించేలా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ నేపథ్యంలో ఈ రచ్చ మొదలైంది. దీనిపై సవాళ్లు, ప్రతిసవాళ్లుగా రెండు పార్టీల క్యాడర్ మధ్య పరిస్థితి నెలకొంది. ముందుగా తెలుగుదేశం క్యాడర్ విషయానికి వస్తే లోకేష్ తన సమర్ధతను, తన రాజకీయ పరిణితిని నిర్ద్వంద్వంగా చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆయనే నంబర్ 2 అందులో సందేహం లేదు. పార్టీ సీనియర్ నాయకులు నుంచి కింది స్థాయి క్యాడర్ వరకూ ఎవరికీ ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీకి మూడో తరం రాజకీయ వారసుడు ఆయనే అన్న విషయంలో కూడా భిన్నాభిప్రాయానికి చోటే లేదు. అటువంటప్పుడు నారా లోకేష్ ఉపముఖ్యమంత్రి కావాలన్న డిమాండ్ ఎందుకో అర్ధం కాదు.

ఇక ఇప్పుడు జనసేన విషయానికి వస్తే.. ఆ పార్టీ నేతలూ క్యాడర్ కూడా లోకేష్ ను చూసి భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. అటువంటి భయాలు పూర్తిగా అర్ధరహితం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను లోకేష్ డామినేట్ చేస్తున్నారనీ, ఉప ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వంలో పవన్ కల్యాణ్ ప్రాధాన్యత పూర్తిగా తగ్గిపోతుందనీ జనసేన కార్యకర్తల భయంగా కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో  జనసేన అధికార ప్రతినిథి రాయపాటి అరుణ స్పందించిన తీరు హుందాగా ఉంది. ఓ టీవీ డిబేట్ లో పాల్గొన్న ఆమె తెలుగుదేశం నుంచి నారా లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిని చేయాలన్న డిమాండ్ లో తప్పేముందన్నారు. ఆ పార్టీ నాయకులు, క్యాడర్ లోకేష్ ను ఉప ముఖ్యమంత్రిగా చూడాలని భావిస్తే తప్పేముంది.. జనసేన నాయకురాలిగా తాను పవన్ కల్యాణ్ ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నాను. ఇది తప్పు కానప్పుడు తెలుగుదేశం నారా లోకేష్ ను మరింత ఉన్నత స్థానంలో చూడాలని కోరుకోవడాన్ని ఎలా తప్పుపట్టగలమని ప్రశ్నించారు.

 తెలుగుదేశం నుంచి లోకేష్ ఉప ముఖ్యమంత్రి అన్న డిమాండ్ బయటకు రావడంతోనే జనసేనలో గాభరా మొదలైంది. ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన జనసైనికులు కొందరు తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కూలదోస్తాం, జగన్ పార్టీతో పొత్తు పెట్టుకుంటాం అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.  అటువంటి వారందరికీ జనసేన అధికార ప్రతినిథి చక్కటి  సమాధానం ఇచ్చారు. జనసేన పార్టీకి పవన్ కల్యాణే సుప్రీం, అలాగే చంద్రబాబు తరువాతి స్థానం తెలుగుదేశంలో నిస్సందేహంగా లోకేష్ దే. కూటమి ప్రభుత్వం విషయానికి వచ్చే సరికి అది తెలుగుదేశం, జనసేనల సమష్టి వ్యవహారం. దీనిలో పార్టీల ప్రశక్తే లేదు. ఒక పార్టీ మరో పార్టీని డామినేట్ చేస్తుందనీ, ఒక నాయకుడి వల్ల మరో నాయకుడి ప్రాధాన్యత తగ్గుతుందన్న ఆందోళనలు అనవసరం.

తెలుగుదేశం, జనసేనల మధ్య ఇంత వరకూ ఎటువంటి పొరపొచ్చాలూ లేవు. ఇప్పుడు కూడా అటువంటి పొరపొచ్చాలకు తావీయవలసిన అవసరం లేదు. లోకేష్ కు తక్షణం ఎలివేషన్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకుంటే.. ఆ విషయాన్ని మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చర్చించి, ఆయన అంగీకారంతోనే ఆ పని చేస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. జనం కూటమి ప్రభుత్వానికి ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలని పగ్గాలు అప్పగించారు. ఇటువంటి చిన్న చిన్న విషయాలలో అసవసర రచ్చ చేసుకుని రోడ్డున పడితే మసకబారేది ఆయా పార్టీల అధినేతల ప్రతిష్ఠే.  ఇక విషయానికి వస్తే ఈ విషయంలో తెలుగుదేశం నాయకులు ఒకింత అతి చేశారని చెప్పక తప్పదు. విధేయతా ప్రదర్శనలో ముందుండాలన్న భావనతోనే ఒకరు డిప్యూటీ సీఎం లోకేష్ అంటే మరి కొందరు మరో అడుగు ముందుకు వేసి సీఎం లోకేష్ అంటూ చేసిన అతే.. జనసేనలో గాభరాకు కారణమైందని చెప్పాలి. మొత్తానికి ఈ విషయంలో జనసేన, తెలుగుదేశంలు రెండూ ఒకింత అపరిపక్వతతోనే వ్యవహరించాయి. ఇప్పటికైనా సంయమనం పాటించి ఈ వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టడం అన్ని విధాలుగా మంచింది.