వివేకా హత్యపై మరో సినిమా.. వస్తారు మొత్తం బయటకు వస్తారు | another moovie on viveka murder| titile| hatya| release| january24th| sensor
posted on Jan 21, 2025 2:20PM
మాజీ మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో వైఎస్ జగన్ పార్టీ విజయానికి ఈ హత్య ద్వారా వెల్లువెత్తిన సానుభూతి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికలకు ముందు వివేకా హత్య వెనుక ఉన్నది తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
సొంత మీడియాలో నారాసుర రక్త చరిత్ర అంటూ కథనాలు వండి వార్చింది. సరే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి అంటే 2019 ఎన్నికల సమయానికి గతంలో వైసీపీ చేసిన ప్రచారం ఇప్పుడు బూమరాంగ్ అయ్యింది. దర్యాప్తులో ఈ హత్య వెనుక ఉన్నది వైసీపీయే అన్నది దాదాపుగా తేలిపోయింది. కోర్టులు నిర్ధారించి తీర్పు వెలువరించలేదు కానీ.. దర్యాప్తు సాగిన తీరు, దానిని అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించిన విధానాన్ని గమనించిన జనాలకు ఈ హత్య వేనుక ఉన్నది ఎవరు? వారిని కాపాడుతున్నది ఎవరు అన్న విషయంలో సందేహాలన్నీ నివృత్తి అయిపోయాయి. సరే 2019 ఎన్నికలలో వైసీపీకి సానుభూతికి ప్రోది చేసిన వైఎస్ వివేకా హత్య.. 2024 ఎన్నికల సమయానికి వైసీపీకి, జగన్ కు పెద్ద ప్రతికూల అంశంగా మారిపోయింది.
ఈ హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ కొమ్ము కాయడం, వివేకా హత్య కేసు విషయంలో జగన్ కు వ్యతిరేకంగా డాక్టర్ సునీత నిలబడటం, ఆమెకు జగన్ స్వంత సోదరి షర్మిల మద్దతు ఇవ్వడంతో విషయాలన్నీ సందేహాలకు అతీతంగా జనానికి అర్ధమైపోయాయి.
ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలకు ముందు ‘వివేకం’ అనే పేరుతో వైఎస్ వివేకా హత్యపై ఓ సినిమా రూపొందింది. వివేకం సినిమా థియోటర్లలో విడుదల కాలేదు. కానీ యూట్యూబ్ ద్వారా లక్షల మంది ప్రజలకు చేరువైంది. అప్పట్లో ఈ సినిమాను షర్మిల కూడా మెచ్చుకున్నారు. వివేకం సినిమాలో వాస్తవాలే చూపారని ఆమె అప్పట్లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సరిగ్గా ఎన్నికలకు ముందు విడుదలైన ఈ సినిమా కూడా వైసీపీ ఘోర పరాజయంలో తన వంతు పాత్ర పోషించిందనడంలో సందేహం లేదు.
ఇప్పుడు వివేక హత్య కేసుపై మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ సినిమా పేరు ‘హత్య’ ఈ నెల 24న ఈ సినిమా థియోటర్లలో విడుదల కానుంది. అయితే ఈ సినిమా సెన్సార్ బోర్డు, రివిజన్ కమిటీల మధ్య దాదాపు తొమ్మిదిన్నర నెలల పాటు ఇరుక్కుపోయింది. ఎట్టకేలకు ఈ సినిమా ఈ నెల 24న విడుదల అవుతున్నా.. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు దాదాపు వంద కట్స్ వేసిందని సమాచారం.