Leading News Portal in Telugu

కాంగ్రెస్ కకావికలు.. అంతర్గత విభేదాలతో కుదేలు? | internal fight in congress| differences| between| rahul


posted on Jan 23, 2025 5:45AM

జాతీయ రాజకీయాలలో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకూ నానాటికీ తీసికట్టు నాగంభోట్లు అన్నట్లుగా మారిపోతోంది. ఈ పార్టీ పరిస్థితి ఉనికిని కాపాడుకోవడానికి తంటాలుపడే పరిస్థితికి చేరుకుందా? అన్న ప్రశ్నలకు పరిశీలకుల నుంచి ఔననే సమాధానమే వస్తోంది. బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఆ పార్టీ ప్రాంతీయ పార్టీల స్థాయికి దిగజారిపోయింది. పొత్తుల్లో భాగంగా ఆ పార్టీ అక్కడి లోకల్ పార్టీల కంటే తక్కువ స్థానాలలో పోటీకి పొత్తు కుదుర్చుకుని ఉనికి చాటుకుంటే చాలన్న పరిస్థితికి దిగజారిపోయింది. 

ఇక జాతీయ స్థాయిలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ఇండియా కూటమి ముక్కులు చెక్కలు అయిపోతున్న పరిస్థితి. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలో కాంగ్రెస్ నేతృత్వాన్ని ఇసుమంతైనా అంగీకరించడానికి సిద్ధంగా లేవు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, అలాగే యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అగ్రనాయకుడు అఖిలేష్ యాదవ్.. ఇలా జాతీయ రాజకీయాలలో బలమైన నేతలుగా ఉన్న వారెవరూ కాంగ్రెస్ వెనుక ర్యాలీ కావడానికి సుముఖంగా లేరు. దీంతో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలన్న ఇండియా కూటమి పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా మారిపోయింది. 

ఈ పరిస్థితిలో గోరు చుట్టు మీద రోకటి పోటు అన్నట్లుగా కాంగ్రెస్ హై కమాండ్ లో అంతర్గత విభేదాలు ఆ పార్టీ ప్రతిష్టను మరింత దిగజారుస్తున్నాయి. కాంగ్రెస్ అనగానే మొట్టమొదట గుర్తుకు వచ్చేది గాంధీ కుటుంబమే. ఆ పార్టీలో ఎటువంటి అధికారిక పదవులూ లేకపోయినా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలే కీలక నేతలు. తమ కుటుంబం నుంచి ఎవరూ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టరు అని ప్రకటించిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. దీంతో అనివార్యంగా అయిష్టంగా తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగిన సోనియాగాందీ.. ఆ తరువాత పార్టీ అధ్యక్ష పీఠాన్ని తనకు అత్యంత విధేయుడైన మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించారు. అంతకు ముందు అశోక్ గెహ్లాత్ ను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినప్పటికీ, చివరి నిముషంలో ఆయన ఝలక్ ఇవ్వడంతో అనివార్యంగా ఖర్గే ఏఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టారు. 

సరే ఏఐసీసీ అధ్యక్షుడు ఎవరైనా గాంధీ కుటుంబమే ఆ పార్టీకి సుప్రీం అన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గ్రాండ్ ఓల్డ్ పార్టీలో ఆ కుటుంబ ఆధిపత్యానికి గండి పడుతోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే, ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మధ్య  వివాదాలు  తీవ్ర స్థాయికి చేరుకున్న‌ట్టు వార్తలు వినవస్తున్నాయి.వీరి మధ్య విభేదాలకు కారణం ఇండియా కూటమి ముక్కలు చెక్కలు అయ్యే పరిస్థితి రావడం, ఖర్గేను విశ్వాసంలోకి తీసుకోకుండా రాహుల్ కీలక అంశాలలో ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించకపోవడంతో పాటు..ఖర్గే పార్టీని సమర్థంగా లీడ్ చేయడం లేదన్న భావన పార్టీలో వ్యక్తం అవుతుండంగా చెబుతున్నారు. 

ముఖ్యంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో రాహుల్ గాంధీ ఏకపక్షంగా ముందుకు సాగడంతో ఖర్గే అవమానం, అసహనంతో రగిలిపోతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఢిల్లీ ఎన్నిక‌ల్లో ఆప్ తో పొత్తు ఉంటేనే బీజేపీని నిలువరించడం సాధ్యమౌతుందని ఖర్గే భావిస్తున్నారు. అయితే రాహుల్ మాత్రం ఒంటరి పోరుకే సై అంటున్నారు. అయితే ఢిల్లీ ఎన్నికలలో ఒంటరి పోరు వల్ల కూటమి విచ్ఛిన్నం అవుతుందన్నది ఖర్గే వాదన. ఒక దశలో ఖర్గే ఏఐసీపీ అధ్యక్ష పీఠం నుంచి వైదొలగడానికి సైతం సిద్ధమయ్యారని వార్తలు వినవచ్చాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత కాంగ్రెస్ లో లుకలుకలు మరింతగా పెచ్చరిల్లే అవకాశాలున్నాయని అంటున్నారు.