Leading News Portal in Telugu

అమరావతికి నో హర్డిల్స్.. ఇక పనులు చకచకా! | amarawath no hurdles| funds| shortage| work| speed| worldbank| hudco


posted on Jan 23, 2025 1:41PM

ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతికి అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. ఆర్థిక ఇబ్బందులు దరి చేరే అవకాశమే లేకుండా నిధుల లభ్యత ఏర్పడింది. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన క్షణం నుంచీ అప్పటి వరకూ అమరావతిని కమ్ముకుని ఉన్న కారు మబ్బులు దూది పింజెల్లా తేలిపోవడం మొదలైంది.  

కేంద్రంలో వరుసగా మూడో సారి అధికార పగ్గాలు అందుకున్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం మద్దతు అత్యంత కీలకం కావడంతో..  తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి మానసపుత్రిక అయిన అమరావతిని అవసరమైన నిధుల లభ్యత విషయంలో కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. అనుకున్న దాని కంటే ఎక్కువ మద్దతు అందించింది. ప్రపంచ బ్యాంకు నుంచి 15 వేల కోట్ల రూపాయల రుణానికి కేంద్రం గ్యారంటీగా నిలిచింది. అక్కడితో ఆగకుండా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హక్డో నుంచి అదనంగా 11 వేల కోట్ల నిధులు మంజూరయ్యారు. మొత్తంగా స్వల్ప వ్యవధిలోనే అమరావతి నిర్మాణానికి 26 వేల కోట్ల రూపాయల నిధులు రావడం ఏ విధంగా చూసినా ఆహ్వానించదగ్గ పరిణామమే కాకుండా, నిర్దుష్ట కాల వ్యవధిలో అమరావతి నిర్మాణం పూర్తి అవుతుందన్న నమ్మకం, విశ్వాసం అందరిలో కలగడానికి దోహదపడ్డాయి.

 ఇలా నిధుల లభ్యతమై ప్రకటన వచ్చిందో లేదో అలా చంద్రబాబు ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులను పట్టాలెక్కించేసింది.  ఈ తరుణంలోనే హడ్కో బోర్డు సమావేశం 11 వేల కోట్ల రూపాయల విడుదలకు ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వానికి వర్తమానం పంపింది. హడ్కో నిధుల విడుదల విషయాన్ని బుధవారం (జనవరి 22) విలేకరుల సమావేశంలో వెల్లడించిన మంత్రి నారాయణ.. అమరావతి పనుల వేగం ఇక నుంచి బుల్లెట్ ట్రైన్ ను మించిపోతుందని అన్నారు. నేడో రేపో ప్రపంచ బ్యాంకు నుంచి కూడా నిధులు విడుదల కానున్నాయనీ.. దీంతో ఇక అమరావతి పనులలో వేగం తప్ప విరామం ఉండదనీ పరిశీలకులు కూడా చెబుతున్నారు.