కర్నాటక సీఎం సిద్దరామయ్యకు లోకాయుక్త క్లీన్ చిట్ | lokayukta clean chit to siddaramayya| muda| scam| case| karnataka| cm
posted on Jan 23, 2025 2:11PM
కర్నాటక సీఎం సిద్దరామయ్యకు లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడ) భూమి కేటాయింపు కేసులో సిద్దరామయ్య, ఆయన సతీమణి పార్వతికి లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ కేసులో సిద్దరామయ్య దంపతులకు ఎలాంటి ప్రమోయం లేదని కుండబద్దలు కొట్టింది. ముడ భూమి కేటాయింపులో సిద్దరామయ్య దంపతుల ప్రమేయంపై ఎలాంటి సాక్ష్యాలూ, ఆధారాలూ లేవని లోకాయుక్త క్లీన్ చిట్ ఇచ్చేసిందని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో అధికారులు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్న లోకాయుక్త, సిద్దరామయ్య దంపతులు మాత్రం ఎలాంటి తప్పూ చేయలేదని చెప్పిందంటున్నారు. ముడ కమిషనర్లు, రెవెన్యూ అధికారులు నిబంధనలను ఉల్లంఘించినట్లు నివేదికలో పేర్కొనడంతో తప్పుచేసిన వారిపై చట్టపర చర్యలు తీసుకోవాలని లోకాయుక్త పేర్కొంది.
లోకాయుక్త ఎస్పీ టీజే ఉదేశ్ నేతృత్వంలో కమిటీ ఈ కుంభకోణంపై దర్యాప్తు చేపట్టింది. తుది నివేదికను న్యాయస్థానానికి సోమవారం (జనవరి 27)న సమర్పించనుంది. . 3.16 ఎకరాలలో ల్యాండ్ కన్వర్షన్ దశలన్నింటిని పరిశీలించిన లోకాయుక్త, ఈ స్థలంలో ముడా 14 సైట్లు పొందినట్లు నిర్ధారించింది. అధికారులే నిబంధనలు పాటించలేదని, సిద్దరామయ్య, ఆయన భార్య ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లేవని పేర్కొంది.
అయితే ఈ స్కాంలో లోకాయుక్త సీఎం సిద్దరామయ్యకు క్లీన్ చిట్ ఇవ్వడంపై ప్రధాన ఫిర్యాదుదారు స్నేహమయి కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా అధికారులు నిబం ధనలను ఉల్లంఘించలేరని వ్యాఖ్యానించిన ఆమె అధికార బలంతో సిద్దరామయ్య బయటపడ్డారని విమర్శించారు. తన పోరాటాన్ని ఇంతటితో ఆపే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. సిద్దరామయ్య తన పలుకుబడి, అధికార బలంతో బయటపడ్డారని, అయితే తన పోరాటాన్ని ఆపబోనని స్పష్టం చేశారు.