posted on Jan 23, 2025 10:04AM
గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దే విషయంలో తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడే మార్గదర్శి, దిక్సూచి అని తెలంగాణ ముఖ్యమంత్రి నారా రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదకగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి ఓ సమావేశానికి అధ్యక్షత వహించిన రేవంత్ రెడ్డి.. 90వ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు పునాదులు వేశారని అన్నారు.
ఆ నాడు చంద్రబాబు నాయుడి విజన్, హైదరాబాద్ లో ఐటీ పరిశ్రమ వేళ్లూనుకోవడానికి ముఖ్యమంత్రిగా కాకుండా సీఈవోగా చేసిన కృషి శ్రమే ఇప్పుడు హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగడానికి కారణమని చెప్పారు. ఔను నిజమే ఎప్పుడో పాతికేళ్లకు ముందు ఎంతో ముందు చూపుతో చంద్రబాబు నాటిన ఐటీ విత్తనం ఇప్పుడు మహా వృక్షమైంది. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చింది. ఎ కొండలు గుట్టల నడుమ ముందు చూపుతో చంద్రబాబు సైబరాబాద్ మహానగరాన్ని సృష్టించాడు. హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాలను తలదన్ని అది ప్రపంచ ఐటీ రాజధానిగా మారింది. ఈ విషయాన్ని రాజకీయంగా ఆయనను వ్యతిరేకించేవారు, విభేదించేవారూ కూడా అంగీకరిస్తారు.
ఇదే విషయాన్ని దావోస్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో మారు ఉద్ఘాటించారు. గతంలో అంటే బీఆర్ఎస్ హయాంలో అప్పటి ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కూడా చంద్రబాబు వేసిన బాటలో తాము దర్జాగా నడిచేశామనీ, ఆయన కారణంగానే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదాల్చిందనీ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు ముద్రను ఎవరూ కాదనలేరని మరోమారు రుజువైంది. అసలు దేశంలో ఐటీ ప్రస్తావన వస్తే చంద్రబాబును ప్రస్తుతించకుండా ఉండటం సాధ్యం కాదు.
వాస్తవానికి హైటెక్ సిటీ అంటే, అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ చంద్రబాబు మాత్రమే గుర్తు కొస్తారు. ఆ నిజాన్ని ఎవరూ కాదన లేరు. రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ పెట్టుబడులను ఆకర్షించ గలుగుతోంది, అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది అందుకు కారణం చంద్రబాబు తప్ప మరొకరు కాదు. హైదరాబాద్ లో ఐటీ రంగ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కృషి, పట్టుదల వల్లనే మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజాలు హైదరాబాద్ నగరానికి వచ్చాయి. చంద్రబాబు ముందు చూపు వల్లనే ఐఎస్‌బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ వచ్చాయి. ఆయన విజన్ 2020 కారణంగానే నేడు హైదరాబాద్ నగరం ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. విశ్వనగరంగా ఎదిగింది. ఎదుగుతోంది. ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా చాటారు. తమ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా దావోస్ కు వచ్చిన రేవంత్ రెడ్డి.. ఇక్కడ చంద్రబాబు బ్రాండ్ ను ఉపయోగించుకుంటున్నారు.