Leading News Portal in Telugu

సందేహం లేదు తెలుగుదేశం భావి నేత లోకేషే! | undoubtedly tdp future leader nara lokesh| seniours| juniours| cadre| people


posted on Jan 24, 2025 1:16PM

ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా అవసరం లేని చర్చ జోరుగా సాగుతోంది. ఎలాంటి హేతువూ లేకుండానే తెలుగుదేశం, జనసేన శ్రేణులు నేతల మధ్య పోటాపోటీ ప్రకటనలు వెలువడుతున్నాయి. రెండు పార్టీలూ పొత్తులో ఉన్నాయి సందేహం లేదు. పొత్తులో ఉండటమంటే రెండూ ఒకే పార్టీ అని కాదు. ఎవరి పార్టీ వారిదే. కానీ రెండు పార్టీలూ సమన్వయంతో పని చేసుకుంటాయి. ఒక పార్టీ నిర్ణయంతో రెండో పార్టీకి సంబంధం ఉండదు. కానీ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విషయంలో  జనసేనలో అభద్రత, తెలుగుదేశంలో జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీనికంతటికీ కారణం నారా లోకేష్ కు ఉపముఖ్యమంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలంటూ తెలుగుదేశం నుంచి వచ్చిన డిమాండ్. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వారికి నచ్చిన డిమాండ్ చేయవచ్చు. అది తెలుగుదేశం సొంత వ్యవహారం. ఇక ప్రభుత్వంలో మంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయడం అన్న విషయానికి వస్తే డిమాండ్లు, ఖండనల గురించి పట్టించుకోవలసిన అవసరమే లేదు. ఆ విషయంపై ఇరు పార్టీల అధినేతలూ చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అన్నిటికీ మించి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ప్రమోషన్ అన్న విషయంలో ఇరు పార్టీల అధినేతల స్పందన సెన్సిబుల్ గా ఉ:ది. తమతమ పార్టీల నేతలు, శ్రేణులకు ఆ విషయంపై నోరెత్తవద్దన్న స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇప్పుడు  తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ భవిష్యత్ నాయకుడు అన్న చర్చ ఆరంభమైంది. ఇది కూడా అనవసరమే. ఎవరైనా సరే ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విషయం తెలుగుదేశం నేతలు, శ్రేణులకే కాదు, మొత్తం అందరికీ తెలిసిన విషయమే. తెలుగుదేశంలో చంద్రబాబు తరువాత ఆ స్థాయి ఉన్న నేత లోకేష్ వినా మరొకరు కనిపించరు. సహజంగానే మీడియా అడిగిన ప్రశ్నలకు తెలుగుదేశం నేతలంతా పార్టీ భవిష్యత్ నేత నారా లోకేష్ అనే చెబుతారు.

మంత్రి అచ్చెన్నాయుడు కూడా  అదే సమాధానం చెప్పారు. ఆయన ఇంకొంచం గట్టిగా, ఘాటుగా అసలీ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్ లో చంటి పిల్లాడిని అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం చెబుతారు అంటూ భవిష్యత్ లో తెలుగుదేశం సారథి నారా లోకేషే అని స్పష్టంగా చెప్పేశారు.  అయితే నారా లోకేష్ కు పార్టీలో, ప్రజలలో ఈ గుర్తింపు, ప్రాధాన్యత రావడానికి ఆయన నారా చంద్రబాబు కుమారుడు కావడం ఎంత మాత్రం కాదు. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలలోకి అడుగు పెట్టినా, స్వయంకృషితో ఆయన అంచలంచలుగా ఎదిగారు. లోకేష్ తనను తాను ప్రజా నాయకుడిగా మలచుకున్న తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. 

వాస్తవానికి ఆయన రాజకీయాలలో తొలి అడుగు వేయకముందే.. ప్రత్యర్థులు టార్గెట్ చేశారు. ఆహారం, ఆహార్యం, భాష నుంచి ప్రతి విషయంలోనూ వ్యక్తిత్వహననమే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. అటువంటి విమర్శలను ఎదుర్కొని తన సత్తాను చాటారు నారా లోకేష్. స్పష్టంగా చెప్పాలంటే వక్రబుద్ది నేతలు చెక్కిన శిల్పం నారా లోకేష్ .  పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.   టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి, పడిన శ్రమ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా పార్టీ బాధ్యతలను భుజానికెత్తుకుని.. పార్టీని విజయతీరాలకు నడిపించిన నాయకుడు నారోలోకేష్. యువగళం పాదయాత్ర తరువాత  నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ  ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు.  సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి.

అందుకే  తెలుగుదేశం భవిష్యత్ నేతగా  పార్టీలో భిన్నాభిప్రాయం అన్నదే లేదు.  తెలుగుదేశం పార్టీ భవిష్యత్ సీఎం అభ్యర్థి నారా లోకేషే అని పార్టీ సీనియర్ నేతలే ప్రకటిస్తున్నారంటే ఆయన నాయ కత్వానికి ఎంతగా మద్దతు ఉందో ఇట్టే అవగతమైపోతుంది.  నారా లోకేష్ లో మాస్ లీడర్ తో పాటు, మేధావులు, విద్యావంతులను ఆకట్టుకోగలిగే విషయ పరిజ్ణానం కూడా మెండుగా ఉంది. అందేకే తెలుగుదేశం భవిష్యత్ నేత నారా లోకేష్ అన్న విషయంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలూ లేవు. తండ్రికి తగ్గ తనయుడిగా, ఇంకా చెప్పాలంటే తండ్రిని మించిన తనయుడిగా అశేష ప్రజానీకమే ఆయనను అంగీకరిస్తున్నారు. దటీజ్ లోకేష్.