విజయసాయిరెడ్డి రాజీనామా అస్త్రం.. కేసుల నుంచి బయటపడేందుకేనా? | vijaya sai goodbye to politics| resign| rajyasabha| membership| ayodhyaramireddy
posted on Jan 24, 2025 8:36PM
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రాజకీయాల్లో తలపండిన వారు సైతం ఊహించని విధంగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన రాజ్యసభ సభ్యత్వానికి శనివారం (జనవరి 25) రాజీనామా చేయనున్నట్లు ప్రకటించాడు. రాజకీయాలకు తాను దూరంగా ఉంటానని.. రాబోయే కాలంలోనూ ఏ పార్టీలో చేరబోనని స్పష్టం చేశాడు. ఒక విధంగా రాజకీయ సన్యాసం ప్రకటించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు శుక్రవారం ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం వైసీపీ శ్రేణులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఒక్కొక్కరుగా ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు జగన్ మోహన్ రెడ్డి పార్టీలో ఉండలేమని బయటకు వచ్చి ఇతర పార్టీల్లో చేరారు. మరికొంత మంది అదే బాటలో నడిచేందుకు రెడీ అవుతున్నారు. అయితే, విజయసాయిరెడ్డి లాంటి నేత పార్టీని వీడుతారని ఏ ఒక్కరూ ఊహించలేదు. కానీ, ప్రస్తుతం ఆయన రాజకీయాలకు గుడ్ బై చెబుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఆయన తాజా నిర్ణయం వెనుక పలు కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా పార్టీలో ఆయనకు తగిన ప్రాధాన్యత లేకపోవటం, వెంటాడుతున్న కేసులు. వైసీపీలో ఉంటే తనను ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చునని విజయసాయిరెడ్డి కొద్ది రోజులుగా భయపడుతున్నాడని, ఈ క్రమంలోనే కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నాలలో భాగంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. రాజ్యసభ సభ్యత్వానికి శనివారం (జనవరి 25) రాజీనామా చేయబోతున్నా.. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ క్రమంలో వైఎస్ఆర్ కుటుంబంపై, జగన్ మోహన్ రెడ్డిపై ఆయనకున్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నమూ చేశారు. వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటానన్న విజయసాయిరెడ్డి.. జగన్ మోహన్ రెడ్డి, భారతికి సదా కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పారు. అంతేకాదు.. జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నానని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, ఆయన కుటుంబంపైనా, అదే విధంగా పవన్ కల్యాణ్ పైనా విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా తాను చేసిన ట్వీట్ లో వారి పేర్లనూ ప్రస్తావించారు. తెలుగుదేశంతో రాజకీయంగా విబేధించా.. అంతేత ప్ప చంద్రబాబు, ఆయన కుటుంబంతో తనకు వ్యక్తిగతంగా విభేదాలు లేవనీ, పవన్ కల్యాణ్ తోనూ చిరకాల స్నేహం ఉందంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇక నుంచి రాజకీయాలకు నాకు సంబంధం లేదని..తన భవిష్యత్ మొత్తం వ్యవసాయంపై దృష్టిపెడతానని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
వాస్తవానికి విజయసాయిరెడ్డి జనంలో పెరిగిన నాయకుడు కాదు. జనం ఆదరించిన నాయకుడు అంతకంటే కాదు. కేవలం నామినేటెడ్ పదవుల ద్వారా ప్రజలపై పెత్తనం చెలాయించిన నేత మాత్రమే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మంచి పరిచయం ఉండటంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కు నమ్మకమైన వ్యక్తిగా మెలిగారు. ఆ సమయంలో జగన్ మోహన్ రెడ్డి కంపెనీలు పెట్టడంలో, అందుకు కావాల్సిన అన్ని విషయాల్లో విజయసాయిరెడ్డి కీలక భూమిక పోషించారు. ఈ క్రమంలోనే అనేక అవకతవకలు జరిగాయి. ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో జగన్ నెంబర్ 1 అయితే, విజయసాయిరెడ్డి నెం.2గా ఉన్నారు. ఇదిలా ఉంటే.. వైసీపీలో కూడా చాలా కాలం పాటు విజయసాయిరెడ్డి నెం.2గా కొనసాగారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంలో విజయసాయిరెడ్డి కీలక భూమిక పోషించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది కాలానికే ఆ పార్టీలో ఆయన స్థాయి దిగజారుతూ వచ్చింది. గత ఎన్నికల ముందు మళ్లీ పార్టీలో కీలక నేతగా వ్యవహరించినప్పటికీ.. వైసీపీ ఘోర ఓటమి పాలైంది. ఆ తరువాత కాలంలో పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా యాక్టివ్ గా విజయసాయిరెడ్డి కనిపించ లేదు. రాజ్యసభ సభ్యుడిగా కేవలం ఢిల్లీ రాజకీయాలకే పరిమితం అయ్యారు.
విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పడానికి ప్రధాన కారణాల్లో బీజేపీతో ఉన్న సంబంధాలుకూడా ఓ కారణంగా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అమిత్ షాతో విజయసాయిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉండటం ద్వారా గవర్నర్ పదవిని దక్కించుకోవచ్చునన్న ఆలోచనలో విజయసాయిరెడ్డి ఉన్నట్లు సమాచారం. బీజేపీ ముఖ్య నేతల నుంచిసైతం అందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్న వాదన వైసీపీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్నది.
మరోవైపు.. కేసుల నుంచి తప్పించుకునేందుకు విజయసాయిరెడ్డి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగించారన్న వాదన కూడా వినిపిస్తోంది. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ , కాకినాడ సెజ్‌లోని వాటాలను బలవంతంగా లాగేసుకున్నారని విజయసాయిపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల ఈడీ విచారణకు సైతం హాజరయ్యారు. కాకినాడ సెజ్‌లో తన వాటాలను బలవంతంగా లాక్కున్నారన్న కర్నాటి వెంకటేశ్వరరావు ఫిర్యాదుతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లుగా విజయసాయిరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన దందాల వ్యవహారంకూడా వెలుగులోకి వచ్చింది. వైసీపీ హయాంలో చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో తన మెడకు ఉచ్చుబిగిస్తున్నదని భావించిన విజయసాయిరెడ్డి వాటి నుంచి తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగానే రాజీనామా అస్త్రాన్ని ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతున్నది.
రాజకీయాలకు దూరమైతే ఏపీలోని కూటమి నేతలతో సత్సంబంధాలు ఏర్పడతాయని, ఆ తరువాత నెమ్మదిగా బీజేపీ పెద్దల ద్వారా తనపై నమోదైన కేసులు, విచారణల నుంచి బయటపడొచ్చని విజయసాయిరెడ్డి ఆలోచనగా వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఏదిఏమైనా వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా బిగ్ షాక్ అనే చెప్పొచ్చు.
విజయసాయి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గంటల వ్యవధిలోనే వైసీపీకి చెందిన మరో కీలక నేత అయోధ్యరామిరెడ్డి కూడా తాను వైసీపీకి గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించారు. రాంకీ గ్రూప్ సంస్థల అధిపతి అయిన అయోధ్యరామిరెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు కూడా, జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఇద్దరు కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పడం సంచలనంగా మారింది. అదే సమయంలో జగన్ నాయకత్వంపై ఆయనకు అత్యంత సన్నిహితులే విశ్వాసం కోల్పోయారని తేటతెల్లం చేసింది.