ఏబీవీపై కేసు సరే.. జగన్, విజయసాయిలను ఏం చేయాలి? | jagan media poisoning in the name of caste| abv| jagan| vijayasai
posted on Jan 24, 2025 8:54AM
కిందపడ్డా మాదే పై చేయి. మేం ఎవర్నైనా ఏదైనా అంటాం.. మమ్మల్ని అంటే మాత్రం సహించం. మేము ఏం చేసినా ఏం మాట్లాడినా, చివరికి బూతులు తిట్టినా తప్పు కాదు.. అదే మమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అది తప్పు. క్షమించరాని నేరం. ఇదీ మొదటి నుంచీ వైసీపీ నేతల తీరు. జగన్ మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిసహా ఆ పార్టీ నేతలు ఎవరినైనా ఇష్టమొచ్చినట్లు తిట్టొచ్చు. కులాల పేరుతో బహిరంగంగా విమర్శలు చేయొచ్చు. పలానా కులాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి వెలివేయాలని అనొచ్చు . వారు ఏదన్నా కరెక్ట్ అంటూ సమర్ధించుకుంటారు. కానీ, వారి వ్యాఖ్యలను విమర్శిస్తే మాత్రం తట్టుకోలేరు. వారి సొంత మీడియా , పార్టీ సోషల్ మీడియా ద్వారా అదే పనిగా అసత్యాలతో తప్పుడు ప్రచారం చేయిస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీల నేతలను, ఏపీలోని కమ్మ సామాజిక వర్గాన్ని పురుగుల్లా చూసిన జగన్.. ప్రతిపక్షంలోనూ అదే తరహా రాజకీయాలు చేస్తున్నారు. తాను చేసిన తప్పులను ఎత్తిచూపిన వారికి శిక్షలు వేయాలంటూ సొంత మీడియా ద్వారా రోత రాతలు రాయిస్తున్నారు. ఇంతకీ అసలేం జరిగింది.. కుల ప్రస్తావన ఇప్పుడెందుకు తేవాల్సి వచ్చిందీ అంటే..
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏపీలో 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన నాటినుంచి ఏపీలోని కమ్మ సామాజిక వర్గాన్ని రాష్ట్రం నుంచి వెలివేయడమే లక్ష్యం అన్నట్లుగా పనిచేశారు. ఈ ప్రక్రియ ఐదేళ్ల పాటు సాగింది. ఇది ఏపీ రాజకీయాలపై అవగాహన ఉన్న ప్రతిఒక్కరికీ తెలిసిన విషయమే. అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏపీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన అధికారులపై జగన్ చిన్నచూపు చూస్తూ వచ్చారు. ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు అధికారులపై కేసులు పెట్టించారు. కరోనా కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను అప్పటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్ అడ్డుకుంటే.. కమ్మ సామాజిక వర్గం కుట్ర చేస్తుందంటూ ప్రచారం చేయించారు. మరీ దారుణమైన విషయం ఏమిటంటే.. కరోనా సమయంలో భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ కనుక్కుంటే దానిపైనా వారి పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. అది కరోనా వ్యాక్సిన్ కాదు.. కమ్మ వ్యాక్సిన్ అంటూ ఆరోపణలు చేయడం వారి నీచబుద్ధికి పరాకాష్ట. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావునైతే ముప్పుతిప్పలు పెట్టారు. కేవలం కమ్మ కులానికి చెందిన వ్యక్తి అన్నఅక్కస్సుతోనే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్షపూరితంగా వ్యవహరించింది. ఇది బహిరంగ ర హస్యమే. అప్పట్లో జగన్ ప్రభుత్వం తీరుపై విమర్శలు సైతం వచ్చాయి. కానీ, అధికార బలంతో అందరి నోర్లు మూయించారు.
జగన్ మోహన్ రెడ్డికితోడు ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారంలో ఉన్నంతకాలం ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం కమ్మ సామాజికవర్గాన్ని తిట్టడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. ఏపీలో కమ్మోళ్లు ఎవరూ బిజినెస్ లు చేసుకోవద్దు.. ఆ సామాజిక వర్గంవారు మీడియా సంస్థలు నడపొద్దు.. అసలు వారు రాష్ట్రంలో ఉండొద్దు అన్నట్లుగా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు. వీరి వెకిలి చేష్టలను భరించలేని ప్రజలు ఎన్నికల్లో గట్టి బుద్ది చెప్పారు. వైసీపీకి కనీసం ప్రతిపక్ష పార్టీ హోదా కూడా ఇవ్వకుండా.. మీ నిర్వాకం ఐదేళ్లు భరించాం. ఇక చాలు అంటూ ఓటుతో గుణపాఠం చెప్పారు. గతంలో చంద్రబాబు నాయుడు అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ, ఏ సామాజిక వర్గాన్ని ఆయన విమర్శించలేదు. చంద్రబాబు హయాంలో అన్ని సామాజిక వర్గాల వారికి మేలు జరిగింది. అన్ని సామాజిక వర్గాల వారికి కీలక పదవులు దక్కాయి. కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లూ రాష్ట్రంలో కక్షా రాజకీయాలు కొనసాగాయి. ఇదే విషయాన్ని ఇటీవల ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జగన్ కమ్మ సామాజిక వర్గంపై ఏవిధంగా కక్షపూరితంగా వ్యవహరించారో పూసగుచ్చినట్లు వివరించారు. వైసీపీ హయాంలో తనకు జరిగిన అన్యాయాన్నీ, అవమానాలను వివరించారు.
ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలను జగన్ సొంత మీడియా తనకు మాత్రమే సాధ్యమైన వక్రభాష్యంతో హైలైట్ చేసింది. నిజాలను ఒప్పుకోకుండా ఏబీపై విమర్శల దాడిచేసింది. అలాగే, ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలు చూసి ఎవరైనా దాడులకు దౌర్జన్యాలకు దిగితే పరిస్థితి ఏంటి అంటూ బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. దీనికితో డు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయాలనే డిమాండ్ ను కూడా లేవనెత్తింది. అయితే, జగన్ మీడియా గుర్తించాల్సిన అసలు విషయం మాత్రం ఇప్పటికీ గుర్తించడం లేదు. దీంతో వైసీపీ మీడియా తీరును గురువింద సామెతను గుర్తు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ మీడియా అన్నట్లు కుల ప్రస్తావన తెచ్చిన ఏబీ వెంకటేశ్వరరావుపై కేసులు పెడితే.. మరి జగన్, విజయసాయిరెడ్డి, ఆ పార్టీలోని కొందరి నేతలపై ఎన్ని కేసులు పెట్టాలి..? ఏబీ వెంకటేశ్వరరావు వ్యాఖ్యలపై కేసు పెట్టాల్సి వస్తే..గతంలో జగన్, విజయసాయి, ఇతర వైసీనీ నేతల వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలకు వారిని ఉరి తీయాల్సి ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ గా జరుగుతోంది. కుల ప్రస్తావన తెచ్చిన ఏబీపై కేసులు పెట్టాలని కోరిన జగన్ మీడియా.. మరి జగన్, విజయసాయిరెడ్డిపై ఏఏ కేసులు పెట్టాలో కూడా చెప్పాలంటూ నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.