గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ ప్రణాళిక రెడీ! | action plan ready for godawary pushkaralu| rajamahendravaram| new| ghats| roads| bridges| developement| budget
posted on Jan 25, 2025 3:01PM
12 ఏళ్లకు ఒక సారి వచ్చే గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ఏపీ సర్కార్ రెడీ అవుతోంది. ఈ సారి 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకూ గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు షురూ చేసింది. ప్రాథమిక అంచనా మేరకు ఈ సారి గోదావరి పుష్కరాలకు ఎనిమిది కోట్ల మంది భక్తులు వస్తారు. ఘాట్ల నిర్వహణ, తొక్కిసలాటలు జరగకుండా తీసుకోవలసిన చర్యలపై పూర్తిగా దృష్టి పెట్టింది.
ఫలానా ఘాట్ లోనే స్నానం చేయాలన్న నియమం ఏదీ లేదనీ, ఏ ఘాట్ లోనైనా స్థానం చేయవచ్చునన్న ప్రచారానికి పెద్ద పీట వేయాలని నిర్ణయించింది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఘాట్ల అభివృద్ధిపై దృష్టి సారించిన ప్రభుత్వం ఇప్పటికే ఘట్ల అభివృద్ధికి 904 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు రెడీ చేసింది. గోదావరి పుష్కరాల కోసం కేంద్రం ఇప్పటికే వంద కోట్ల రూపాయలు కేటాయించిన సంగతి తెలిసిందే. అలాగే పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ విస్తరణ, ఆధునీకరణ కోసం 271.43 కోట్ల రూపాయలు కేటాయించింది.
దేశంలో ప్రధాన ప్రాంతాల నుంచి రాజమండ్రికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు నిర్ణయించింది. వాటి వివరాలను ముందుగానే వెల్లడించేందుకు అధికార యంత్రాంగం నిర్ణయం తీసుకుంది గోదావరి పుష్కరాలు-2027 ముసాయిదా కార్యాచరణను కూడా సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్, టూరిజం, దేవాదాయ శాఖల అధికారులు సంయుక్తంగా పుష్కర ఏర్పాట్ల పైన సమీక్ష నిర్వహించాలని ఆదేశించింది .యాత్రికుల బస ఏర్పాట్లతోపాటు రాజమహేంద్రవరంలో ప్రస్తుతం ఉన్న ఘాట్లకు అదనంగా మరో నాలుగు కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
కార్పొరేషన్ పరిధిలో రోడ్ల అభివృద్ధికి రూ.456.5 కోట్లు, ఆర్అండ్బీ రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి రూ.678.76 కోట్లతో ప్రతిపాదనలు రెడీ చేశారు. ని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో గోదావరి పుష్కరాల పైన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కార్యాచరణ ఖరారు చేయడానికి అధికారులు సమాయత్తమౌతున్నారు.