గుండ్రాంపల్లిలో కొత్తరాతియుగపు ఆనవాళ్లు.. చిట్యాలలో 4వేల ఏళ్ల నాటి రాతి గొడ్డలి! | landmarks of the new stone age| four| thousand years| old| axe
posted on Jan 25, 2025 4:11PM
పరిరక్షించుకోవాలంటున్న ప్లీచ్ ఇండియా సీఈవో ఈమని శివనాగిరెడ్డి
చిట్యాల మండలం, గుండ్రాంపల్లి శివారులో క్రీ.పూ. 4000 సంవత్సరాల నాటి రాతి గొడ్డలి లభించిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా సీఈఓ, డాక్టర్ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. పురాతన వారసత్వ సంపదను గుర్తించి, కాపాడాలని గ్రామస్తులకు అవగాహన కల్పించే “ప్రిజర్వ్ హెరిటేజ్ ఫర్ పోస్టరిటీ” కార్యక్రమంలో భాగంగా ఆయన శనివారం గుండ్రాంపల్లి, ఏపూరు గ్రామాల మధ్యలో నాగులకట్ట వద్ద చేపట్టిన అన్వేషణలో 15 సెం. మీ. పొడవు, 6 సెం.మీ. వెడల్పు, 2 సెం.మీ. మందంగల నల్ల సానపు రాతిగొడ్డలి కనిపించిందని చెప్పారు.
నాగులకట్ట పైన కాకతీయుల కాలానికి చెందిన క్రీ.శ. 13వ శతాబ్దం నాటి నాగదేవతల శిల్పాలు ఉన్నాయని, ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిర్లక్ష్యంగా పడిఉన్న ఈ చారిత్రక శిల్పాలను కాపాడుకోవాలని గ్రామస్తులకు శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వారసత్వ కార్యకర్త యడ్లపల్లి అమర్నాథ్ పాల్గొన్నారు అని ఆయన అన్నారు. శివనాగిరెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో కొత్త రాతియుగపు ఆనవాళ్లు బయటపడటం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి అని చెప్పారు.